రైతులను రారాజులను చేస్తాం ఎమ్మెల్యే అనంత

*రైతును రారాజును చేస్తాం*

*పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర*

*దళారుల ప్రమేయం ఎక్కడున్నా కఠిన చర్యలు*

*రైతులు తలెత్తుకుని తిరిగేలా చేస్తాం*

*అన్నదాతలకు దగ్గరగా ఉండే ప్రభుత్వం మాది*

*ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి**

అనంతలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం*

*కందుల గ్రేడింగ్‌ను స్వయంగా పరీక్షించిన ఎమ్మెల్యేలు*

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతును రాజును చేస్తే.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతను రారాజును చేస్తున్నారని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు. శనివారం అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయనతో పాటు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ పంట పెట్టుబడి కింద రైతులకు ఏటా రూ.13,500, సబ్సిడీతో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పంట చేతికి వచ్చినప్పుడు గిటుబాటు ధరలు లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు చెప్పారు. నష్టాల నుంచి గట్టెక్కించడానికి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని తెలిపారు. కందులు బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.4800 వరకు ఉంటే ప్రభుత్వం రూ.5800కు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో పప్పుశనగ రూ.3600 వరకు ఉంటే ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.4875 అందజేస్తుందన్నారు. వేరుశనగకు కూడా రూ.5090 కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. రైతులు పండించే ఏ పంటకైనా మద్దతు ధర కల్పిస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. ఎవరైనా తక్కువ ధర ఇస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. దళారుల బెడద లేకుండా చేసి రైతులు తలెత్తుకుని తిరిగేలా చేస్తామన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే ప్రతిపక్షం అసూయతో విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. రైతు సంక్షేమం విషయంలో ఒక అడుగు ముందుకే వేస్తామని స్పష్టం చేశారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ కందుల కొనుగోలు కేంద్రాల వల్ల బహిరంగ మార్కెట్‌ ధర కంటే రైతుకు క్వింటాల్‌పై అదనంగా రూ.1000 వరకు సమకూరుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉల్లి, ఎండు మిర్చి, పసుపు పంటకు సైతం కనీస మద్దతు ధర ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందజేయనున్నట్లు చెప్పారు. రైతులు వీలైనంత వరకు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌పై దృష్టిపెట్టాలన్నారు. పండించిన పంటకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పిస్తామని, తమ ప్రభుత్వం రైతులకు దగ్గరగా ఉంటుందని స్పష్టం చేశారు. శింగనమల నియోజకవర్గంలో మొదటి దశగా ఐదారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటిస్తే చేస్తారని, ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పంటకు కనీస మద్దతు ధరను కల్పించి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సుబ్రమణ్యం, మార్కెటింగ్‌ శాఖ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్‌ యార్డు సూపర్‌వైజర్‌ వెంకటేశ్, శింగనమల సొసైటీ అధ్యక్షుడు శ్రీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*కందుల గ్రేడింగ్‌ పరిశీలన*

మార్కెట్‌ యార్డుకు రైతులు తీసుకొచ్చిన కందులను ఎమ్మెల్యేలు అనంత, పద్మావతి స్వయంగా పరిశీలించారు. వాటిని గ్రేడింగ్‌ చేశారు. కందులను తీసుకొచ్చే రైతులు ఎండబెట్టి తీసుకురావాలని, తద్వారా తేమ శాతం తక్కువగా ఉంటుందన్నారు. అధికారులు కూడా గ్రేడింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుని రైతులకు మేలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *