రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆదుకుంటాం.. కనీస గిట్టుబాటు ధర కల్పిస్తాం…సీఎం జగన్

రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అయినప్పటికీ.. సరైన ధర రాకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలతో రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ సంస్థలతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… రైతు భరోసా కేంద్రాలు ఆకాశమే హద్దుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నేచురల్‌ ఫార్మింగ్‌కు సంబంధించి మరికొన్ని సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలన్నారు. అగ్రి మార్కెటింగ్‌ అంశాలపై కూడా ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని సూచించారు.

మీతో భాగస్వామ్యం ఎంతో ముఖ్యం..
‘‘అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలోకి పరిపాలనను తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశాం. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రతి 2వేల జనాభాకు ఏర్పాటు చేశాం. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించాం. వివక్ష లేకుండా, అవినీతి రహితంగా, నిర్దేశిత సమయంలోగా సర్వీసులను అందిస్తున్నాం. లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలముందే ఉంచుతున్నాం. వీటికి అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జూన్‌ నాటికి మొత్తం అన్ని రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు, వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లు కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉంటారు. నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో లభించే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్‌ ఫార్మింగ్‌పైన రైతులకు శిక్షణ ఇస్తాం. ఉత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పంట వేసేముందే పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తాం. రైతు భరోసాకేంద్రాలకు వివిధ అంశాల్లో స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ఉండాలి.

అదే విధంగా పశువులకు మంచి వైద్య సేవలు అందాలి. రాష్ట్రంలో 50శాతం మంది రైతులు 1.25 ఎకరాల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారే. 70శాతం రైతులు 1 హెక్టారు కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారే. రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.13500 ఇస్తున్నాం. ఈ రూపంలో దాదాపుగా 80శాతం పెట్టుబడి ఖర్చు ఇస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ ఇస్తున్నాం. ఈ డబ్బును బ్యాంకులు మినహాయించకుండా అన్‌ ఇంకబర్డ్‌ బ్యాంకు ఖాతాల్లోకి వేస్తున్నాం. రైతులు కట్టాల్సిన పంటబీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 60 శాతం ఫీడర్లలో 9 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం.

ఈ జులై నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా అందించడానికి ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ సమూల మార్పులకు నాంది పలుకుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవానికి ఇవన్నీ దోహదపడతాయి. జాతీయ సంస్థల సహకారం మాకు ఎంతో కీలకం. మీతో భాగ​స్వామ్యం చాలా ముఖ్యం. పరిపాలనను గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడుతుంది’’అని సీఎం జగన్‌ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *