రోహిత్ సరదాగా కుటుంబంతో..

టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ విశ్రాంతి సమయంలో సతీమణి రితిక, కుమార్తె సమైరాలతో కలిసి రోహిత్‌ సరదాగా గడుపుతున్నాడు. సమైరాతో కలిసి అతడు దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన్‌లో తన కూతురికి రోహిత్‌ ఏదో చూపిస్తున్నాడు. అయితే సమైరా కూడా ఎంతో ఆసక్తిగా తండ్రి చూపించిన అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఆ ఫోటోలో ప్రతిబింబిస్తుంది. ఈ ఫోటోను ముంబై ఇండియన్స్‌ ఫన్నీగా రూపొందించి తిరిగి రీపోస్ట్‌ చేసింది. ‘రోహిత్‌ కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌.. ఎంత క్యూట్‌గా ఉంది. అమెకు ఒకటి నుంచి పది వరకు ఎన్ని పాయింట్లు ఇస్తారు’అంటూ ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌కు పదికి పది పాయింట్లు ఇస్తామంటూ రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫన్నీగా పేర్కొంటున్నారు.

ఇక రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈ సారి బరిలోకి దిగుతున్న రోహిత్‌ సారథ్యంలోని ముంబై జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌ మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇక తాజాగా కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. రోహిత్‌ జట్టులో ఉంటే వన్డే సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురికాకుండా ఉండేదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *