లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటిన మంగళూరు స్వీటీ

15ఏళ్ల క్రితం కేవలం యోగా టీచర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యి ఏకంగా టాలీవుడ్ నే ఏలింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ అన్న పిలుపందుకుంది. స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటింది. బంపర్ బాక్సాఫీస్ కలెక్షన్లతోనూ తనలోని ధీరత్వం ఏంటో చూపించింది. ఈ భామ ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి. మంగుళూరుకు చెందిన ఈ బ్యూటీ అరుంధతి.. రుద్రమదేవి.. భాగమతి లాంటి చిత్రాలతో గొప్ప నాయిక అన్న పేరు తెచ్చుకుంది.

2005లో నాగార్జున హీరోగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన `సూపర్` సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. సూపర్ హాట్ అందాలతో ఆరంభమే మాయ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన `విక్రమార్కుడు` సినిమాతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అటుపై వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని అగ్ర కథానాయికగా ఎదిగారు.

సౌత్ మొత్తం స్టార్ గా గుర్తింపు దక్కించుకుంది. అనుష్క ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 15 ఏళ్లు పూర్తి చేస్తుకున్న సందర్భంగా గురువారం సాయంత్రం తన పదిహేనేండ్ల జర్నీకి సంబంధించి ఓ ఈవెంట్ ని నిర్వహించింది. ఇందులో తన మొదటి సినిమా దర్శకుడు పూరీతో పాటు కె.రాఘవేంద్రరావు వంటి అనేక మంది దర్శక నిర్మాతలు పాల్గొని స్వీటీని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం అనుష్కకి సంబంధించిన పలు షాకింగ్ నిజాలను వెల్లడించారు. ఆమెకి అనుష్క పేరు ఎలా వచ్చిందో చెప్పారు. ఆయన మాట్లాడుతూ “సూపర్` సినిమాలో హీరోయిన్ కోసం ముంబై వెళ్లినప్పుడు ఓ హోటల్ వద్ద స్వీటీని కలిశాను.

ఫోటో ఇవ్వమంటే తను స్టాంప్ సైజ్ కన్నా చిన్న ఫొటోను ఇచ్చింది. తను సినిమా పక్షి కాదని అర్థమైంది. యాక్టింగ్ వచ్చా? అని అడిగాను. తెలీదు అంది. చేయగలవా? అంటే ఎప్పుడూ ట్రై చేయలేదు. చేస్తానో లేదో తెలియదు అంది. డాన్స్ కూడా తెలియదని చెప్పింది. అప్పుడు మా ఆవిడ తనని చూసి సినిమాలో పెట్టేదామని అంది. నువ్వు ఏం చేస్తున్నావని అంటే నేనొక యోగా టీచర్ని అంది. సరే! నాతో ఆర్నెల్లు హైదరాబాద్ కి రమ్మంటే వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్లి నాగార్జున గారిని కలిపించా. ఆయన అనుష్కను చూసి ఆడిషన్ చేద్దామంటే వద్దు డైరెక్ట్ యాక్ట్ చేయించేద్దామని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల దగ్గర తను యాక్టింగ్ నేర్చుకుంది. తన పేరు స్వీటీ అనే పాస్ పోర్టులో ఉండటాన్ని చూసిన నాగార్జునగారు.. మంచి పేరు పెట్టమన్నారు. అప్పుడు మిల మిల సాంగ్ పాడటానికి వచ్చిన అమ్మాయి పేరు అడిగితే అనుష్క అని చెప్పింది. ఈ పేరు బావుందే అని నాగార్జునగారికి చెబితే బావుంది. అదే పేరు పెట్టేసెయ్ అన్నారు. అలా స్వీటికీ అనుష్క అనే నామకరణం చేశాం. మంచి తనం.. తెలివి తేటలు కలిసిన కాంబినేషన్ తనది. సూపర్ తో స్టార్ట్ అయ్యి.. `నిశ్శబ్దం` వరకు వచ్చింది. తనకు హ్యాట్సాప్“ అని అన్నారు.

స్వీటీ గురించి దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ “అనుష్క మా ఫ్యామిలీ మెంబర్. ఆమె `విక్రమార్కుడు` సమయంలో ప్రతి షాట్ ను చేసి చూపించమనేది. మామూలు సీన్ అయితే ఫర్వాలేదు. కానీ రొమాంటిక్ సీన్ ను కూడా నాతో చేయించి చూసుకుని తను నటించింది. అదే సమయంలో మా కుటుంబానికి ఎంతో దగ్గరైంది. నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కానీ దేవసేన పాత్రను క్రియేట్ చేసినందుకు గర్వపడతుంటాను“ అని చెప్పారు. “నేను ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు అయ్యిందని అంటున్నారు. కానీ.. సీనియర్స్ చేసిన ఎచీవ్మెంట్స్తో పోల్చితే ఇది చాలా చిన్నది. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటాను. ఇంకా బెటర్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను“ అని స్వీటీ ఈ వేదికపై ఆనందం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *