వైసీపీ తీర్థం పుచ్చుకున్న డొక్కా

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి సీఎం జగన్‌ వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. అనంతరం డొక్కా వరప్రసాద్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 2014లోనే వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, కానీ కొన్ని కారణాల రిత్యా టీడీపీలో చేరవల్సి వచ్చిందని వివరించారు. అయినా కూడా టీడీపీలో సరైన గౌరవం లభించలేదని, కాలం కలసిరాలేదని అన్నారు. ఇక డొక్కాను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సురేష్‌, ఎమ్మెల్యే అంబటి ప్రకటించారు.

కాగా ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ సోమవారమే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టీడీపీ నేతల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టీడీపీ అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *