వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ గిరి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరందరికీ సీఎం వైఎస్‌ జగన్‌…కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆవిర్భావం నుంచి మా కుటుంబం ఆ పార్టీలో ఉంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉండి సేవలు అందించడమే కాకుండా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాం. నేను జైల్లో ఉన్నా మా కార్యకర్తలు టీడీపీలో ఉన్నారు. మా కార్యకర్తల అభిప్రాయం మేరకే నేను స్వచ్ఛందంగా వైఎస్సార్‌ సీపీలో చేరాను. మమ్మల్ని ఎవరూ బెదిరించడం లేదు. మనస్ఫూర్తిగా వైఎస్సార్‌ సీపీలో చేరాం. టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక పార్టీ మారుతున్నాం.

సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేస్తున్నారు. జమ్మలమడుగు స్టీల్‌ ప్లాంట్‌, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ చేపట్టారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఒక డైనమిక్‌ లీడర్‌ షిప్‌తో సీఎం జగన్‌ ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం మంచి నిర్ణయం. ప్రజాదరణతో ఏర్పడిన ప్రభుత్వంలో పాలుపంచుకోవాలని మేం వచ్చాం. పార్టీలో చేర్చుకున్నందుకు జగన్‌ గారికి కృతజ్ఞతలు. టీడీపీలో లోపాలు గుర్తించారు కాబట్టే ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్‌ సీపీ స్వీప్‌ చేస్తుంది’ అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘సీజం జగన్‌ నాయకత్వంలో పని చేయాలని రామసుబ్బారెడ్డి భావించారు. ఆయన వైఎస్సార్‌ సీపీలో చేరడం మంచి శుభ పరిణామం. సీఎం జగన్‌ పాలనను చూసే టీడీపీలోని ముఖ్యనేతలు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అభినందిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వం మీద నిస్తేజం వచ్చి ఆ పార్టీ నేతలు వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నారు. అయితే ఆయన ఆ విషయాన్ని గుర్తించకుండా వైఎస్సార్‌ సీపీని నిందిస్తున్నారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తిరస్కరించడమే కాకుండా, పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *