వ్యవసాయం లో విప్లవామాత్మక మార్పులు తీసుకొస్తాం :ఏ పి సీఎం జగన్

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్తమ పద్ధతులు పాటించినప్పుడే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, అధిక ఆదాయం వస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులు, ప్రఖ్యాత శాస్త్ర, సాంకేతిక పరిశోధన సంస్థల నిపుణులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా కీలక చర్యలు చేపట్టామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు నేపథ్యంలో విజ్ఞాన మార్పిడి, శిక్షణ కోసం దేశంలోని 11 జాతీయ సంస్థలతో సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సంస్థలతో భాగస్వామ్యాన్ని హర్షిస్తూ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, అమలు చేస్తున్న ముఖ్య పథకాలను ముఖ్యమంత్రి వివరించారు. పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువెళుతున్నామని చెప్పారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..

స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌
‘రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు, వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లు ఉంటారు. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. వీటికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్‌ ఫార్మింగ్‌లో రైతులకు శిక్షణ ఇచ్చి, ఉత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పంట వేసే ముందే కనీస మద్దతు ధర ప్రకటిస్తాం. దీనివల్ల మార్కెట్లో పోటీ పెరుగుతుంది. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయి. అయినా సరైన ధర రాకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలతో రైతులను ఆదుకుంటాం. ఆకాశమే హద్దుగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి, సేంద్రియ సాగు, వ్యవసాయ మార్కెటింగ్‌లలో మెళకువల కోసం దేశంలోని ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని భావించాం. రైతు భరోసా కేంద్రాలకు వివిధ అంశాల్లో స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ ఉండేలా చూస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులు 1.25 ఎకరాల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారే. 70 శాతం మంది రైతులు హెక్టారు కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారే.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవానికి జాతీయ సంస్థల సహకారం
రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికీ ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఈ రూపంలో దాదాపుగా 80 శాతం పెట్టుబడి ఖర్చు ఇస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ చేస్తున్నాం. ఈ డబ్బును బ్యాంకులు మినహాయించకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కట్టాల్సిన పంటల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 60 శాతం ఫీడర్లలో 9 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. వచ్చే జూలై నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా అందించడానికి చర్యలు చేపట్టాం. పశువులకు మంచి వైద్య సేవలు అందాలి. మత్స్య రంగాన్నీ పటిష్టం చేసి రైతులు నష్టపోకుండా చూడాలి. మంచి విత్తనం, ఫీడ్‌ అందేలా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవానికి ఇవన్నీ దోహదపడతాయి. ఇందుకు జాతీయ సంస్థల సహకారం మాకు ఎంతో కీలకం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

ఇవన్నీ సీఎం మానస పుత్రికలే
వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి మానస పుత్రికలే. రైతు భరోసా కేంద్రాలు చాలా వినూత్నమైనవి. 24 గంటల్లో రైతులు ఆర్డర్‌ చేసిన విత్తనాలు సహా అన్ని రకాల ఉత్పాదకాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తాం.
– కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

మత్స్య ఉత్పత్తుల్లో అగ్రస్థానం
మత్స్య ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. మరింత అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నాం. క్వాలిటీ విత్తనం, నాణ్యమైన ఫీడ్‌ అందించాలన్నది లక్ష్యం. అవసరమైన ప్రతిచోటా ప్రయోగ శాలలను ఏర్పాటు చేస్తున్నాం.
– మోపిదేవి వెంకటరమణ, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి

కొత్తగా 19 వేల మంది సిబ్బంది
వ్యవసాయాన్ని పండుగగా మార్చడానికి ఆలోచనే కాదు.. ఆచరణలో తీసుకురావడానికి ముఖ్యమంత్రి జగన్‌ విశేషంగా కృషి చేస్తున్నారు. కొత్తగా 19 వేల మంది సిబ్బందిని ఇచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీలో వ్యవసాయ సిబ్బంది ఎక్కువ.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *