శిక్షను పొడిగించలేం! సుప్రీంకోర్టు

23ఏళ్ల క్రితం దేశ రాజధానిలోని ఉపహార్‌ థియేటర్‌ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. థియేటర్‌ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధితులు వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు కొట్టేసింది. 1997 సంవత్సరం గ్రీన్‌ పార్క్‌ సమీపంలో ఉపహార్‌ థియేటర్‌లో సినిమా ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసు‍కుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అనూహ్య ఘటనలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనలో థియేటర్‌ యాజమానులైన గోపాల్‌ అన్సల్‌, సుశీల్‌ అన్సల్‌లపై కేసు నమోదైంది.

2007లో వీరిని విచారించిన ట్రయల్‌ కోర్టు దోషులుగా ప్రకటించి రేండేళ్ల జైలు శిక్ష విధించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అన్సల్‌ సోదరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్ష ఏడాదికి తగ్గించబడింది. కాగా, ఈ శిక్షను నిందితులు సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. 60కోట్లు చెల్లిస్తే సరిపోతుందని, జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. అయితే వయసు దృష్ట్యా సుశీల్‌ బన్సాల్‌కు జైలు శిక్ష నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం తీర్పుపై భాదితుల సంఘం మరోసారి క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేయగా.. నిందితులకు శిక్షను మరింత కాలం పొడగించలేమని, ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *