సి ఏ ఏ అనేక అనుమానాలు వున్నాయి :బీహార్ సీఎం నితీష్ కుమార్

పట్నా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నందున దీనిపై పున సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చట్టంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని నితీష్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం పట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఏఏపై మరోసారి సుదీర్ఘ చర్చ జరగాలన్నారు. సీఏఏపై ఈ విధంగా ప్రకటించిన తొలి ఎన్డీయే కూటమి పార్టీ జేడీయూ కావడం విశేషం. సీఏఏపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ డిమాండ్‌ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్‌ఆర్‌సీని బిహార్‌లో అమలు చేసే ప్రసక్తేలేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నితీష్‌ ప్రకటనతో బీజేపీ నేతలు షాక్‌కి గురయ్యారు. కాగా, పార్లమెంట్‌ ఉభయసభల్లో సీఏఏ బిల్లుకు జేడీయూ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నితీష్‌ నేతృత్వంలోని జేడీయూ అన్ని అంశాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రజాగ్రహానికి గురైన చట్టాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. ఇటీవల జరిగిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ అంశాలను పక్కనపెట్టి, కేవలం స్థానిక అంశాలపైనే నితీష్‌ దృష్టి సారిస్తున్నారు. జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వివాదాస్పద చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన సూచనల మేరకే నితీష్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని బిహార్ రాజకీయ వర్గాల సమాచారం. కాగా ఎన్‌సీఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నేతృత్వంలో బిహార్‌, యూపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వీటిల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *