సీఎం జగన్ ను ముఖేష్ అంబానీ అందుకే కలిశాడా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత దేశంలోనే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఇటీవల ఆశ్చర్యకరంగా అమరావతి వచ్చి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశంలోని కుబేరుడి ఇక్కడికి రావడానికి గల కారణాలేంటని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. అయితే ముఖేష్ అంబానీ పర్యటనకు గల కారణాలపై ఊహాగానాలు వెల్లువెత్తాయి.

వాస్తవానికి సీఎం జగన్ షెడ్యూల్ లో అంబానీతో భేటి లేదు. పోనీ పారిశ్రామిక పెట్టుబడుల కోసం కావచ్చు అంటే అదీ లేదు. సీఎంకు దగ్గరగా ఉన్న కొంతమందికి తప్ప.. గన్నవరం విమానాశ్రయంలో దిగేవరకూ అంబానీ వస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు.

ఇక మరో విశేషం ఏంటంటే అంబానీ తనతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారులను కూడా తీసుకురాలేదు. దీంతో ఇది పారిశ్రామికానికి సంబంధించిన భేటి కాదని తెలిసింది. ముఖేష్ అంబానీతో అతడి కుమారుడు అనంత్ అంబానీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాత్వానీ ఉన్నారు.

ఇక సీఎం జగన్ – ముకేష్ అంబానీల సమవేశానికి ప్రభుత్వ అధికారులు ఎవరూ లేరు. ఇది పూర్తిగా ప్రైవేటు భేటి అని తెలిసింది.

అయితే అంబానీతోపాటు రాజ్యసభ ఎంపీ పరిమల్ నాత్వానీ రావడంతో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఏప్రిల్ లో ఖాళీ కాబోయే రాజ్యసభ సీట్లలో నాలుగు వైసీపీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పరిమల్ నాత్వానీని ఏపీ కోటాలో వైసీపీ తరుఫున రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయాలని సీఎం జగన్ ను కోరడానికే ముఖేష్ అంబానీ వచ్చినట్టు సమాచారం.

రిలయన్స్ సంస్థలో టాప్ మేనేజ్ మెంట్ నాథ్వానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. గత రెండుసార్లు జార్ఖండ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ జార్ఖండ్ లో దారుణంగా ఓడిపోవడంతో ఈసారి అక్కడి నుంచి నాథ్వానీ రాజ్యసభకు వెళ్లడం కష్టం. అందుకే ముకేష్ అంబానీయే కదిలివచ్చి సీఎం జగన్ ను ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే దేశంలోనే అపర కుబేరుడు అడగడం.. ఏపీలో పెట్టుబడులకు ఆయన నో చెప్పకపోవడం.. రాజ్యసభ సీటు అడగడంతో ఖచ్చితంగా జగన్ ఈ ప్రతిపాదనకు నో చెప్పడని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *