సుజనా కేసు సిబిఐ కి..

రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరికి సంబంధించిన ఆస్తుల వేలం పాటకు బ్యాంక్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దానితో పాటు సుజనా చౌదరిపై ఆ బ్యాంక్ ఏకంగా సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో సుజనా చౌదరి ఇక తప్పించుకునేందుకు అవకాశమే లేదని పలువురు పేర్కొంటున్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తే ఇక సుజన జైలు పాలవుతాడని అందరూ భావిస్తున్నారు.

సుజనాచౌదరి ఆయన సోదరుడు జతిన్కుమార్ కలిసి తమ సంస్థ ‘సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ విస్తరణ కోసం రూ.322.03 కోట్ల రుణం బ్యాంక్ ఆప్ ఇండియా నుంచి తీసుకున్నారు. అయితే ఆ డబ్బులను దారి మళ్లించి సీఆర్డీఏ పరిధిలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్కు వినియోగించారని తెలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకుండా మోసం చేస్తున్నారని బ్యాంకు ఆ ఫిర్యాదులో పేర్కొంది. వడ్డీతో కలిపి రుణం రూ.400.84 కోట్లకు చేరుకుందని దీన్ని రికవరీ చేసేందుకు తనఖా ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు తెలిపింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణాన్ని దారి మళ్లించిన సుజనా చౌదరి జతిన్కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరింది.

సుజన బ్యాంకులకు ఎగ్గొట్టడం ఇదే మొదటి సారి కాదు. గతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుజనా సీబీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్జెక్ట్ లిమిటెడ్ పేరుతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రూ.304 కోట్ల రుణం తీసుకుని మోసగించడంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో అతడిపై ఇప్పటికే రెండు ఫిర్యాదులు రావడంతో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశం ఉంది.

జాతీయ అంతర్జాతీయ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు తప్పుడు పత్రాలు పెట్టి రూ.8 వేల కోట్లకు పైగా రుణాలు సుజనా సోదరులు తీసుకున్నారని తెలుస్తోంది. వీటిలో అధిక శాతం నిధులను 2004 నుంచి 2014 వరకు ఆ సమయంలో తనకు సన్నిహితంగా ఉన్న పార్టీకి అందజేసినట్లు సమాచారం. అందుకే సుజనా వ్యవహారంపై పలు కేసులు విచారణలో ఉన్నాయి. అయితే చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే సుజనా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడ అనే సమాచారం పొంది భారీగా భూములు తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు సమాచారం.
సుజానా చౌదరి తన కంపెనీలు సోదరుడు జతిన్కుమార్ కుటుంబ సభ్యుల పేర్లతో చౌకగా ప్రస్తుత అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. అధిక శాతం భూములకు అడ్వాన్స్ లు ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకుని రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత 2016 2017 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉండడంతో బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి షెల్ కంపెనీల పేర్లతో భారీగా రుణాలు తీసుకున్నారు. 13.95 శాతం వడ్డీపై అక్టోబర్ 26 2018న బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.322.03 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ డబ్బులతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను విస్తరిస్తానని బ్యాంక్కు హామీ ఇచ్చారు.

రుణానికి జతిన్కుమార్ స్నేహితుడు గొట్టిముక్కుల శ్రీనివాస రాజు షెల్ కంపెనీలతో గ్యారంటీ ఇప్పించారు. అయితే ఈ డబ్బులను కంపెనీ విస్తరణకు కాకుండా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుకు వినియోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సహా సీబీఐకి ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో సుజనా చౌదరి ఏర్పాటుచేసిన 120 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నంబర్లు 432-1 403-5 433 434 402-1ఏ 429 428 412 410-2 427-2 413 415 416 431 437 399-7 404-11 407-4లలో 110.6 ఎకరాల భూమిని రాజధాని ప్రకటన వెలువడక ముందే తక్కువ ధరకు కొనుగోలు చేయగా బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తీసుకున్న రుణాన్ని మళ్లించి 2018 నవంబర్ 13వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం సీఆర్డీఏ పరిధిలో 623.12 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ఈ నిధులను మళ్లించినట్లు గుర్తించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేసింది.

గతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయగా తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయడంతో సీబీఐ సుజనా చౌదరి పై దర్యాప్తు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక నేరాలకు పాల్పడడం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడం తదితర అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. త్వరలోనే సీబీఐ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *