సుప్రీం తీర్పులకు విశేష స్పందన: మోదీ

దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ ఎంతగానో కృషిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలోని సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్టపరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

నేడు 130 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయవ్యవస్థల ద్వారానే పరిష్కరించుకుంటున్నారని మోదీ అన్నారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఆ తీర్పులను ప్రజలు హృదయపూర్వకంగా స్వీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ముమ్మారు తలాక్‌, మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు, దివ్యాంగుల హక్కులపై సుప్రీం ఇచ్చిన తీర్పులను ప్రశంసించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు న్యాయవ్యవస్థ సముచిత న్యాయం చేస్తోందని కొనియాడారు. ప్రస్తుతం డేటా భద్రత, సైబర్‌ నేరాల వంటి సమస్యలు న్యాయవ్యవస్థకు కొత్త సవాలుగా నిలిచాయని, వీటి పరిష్కారానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ విలువలు, ఆదర్శాలను మరోసారి గుర్తుచేశారు. మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారని, ఆయన ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారని కొనియాడారు. న్యాయవాది అయిన గాంధీజీ.. తన ఆత్మకథలో ఆయన జీవితంలో పోరాడిన మొదటి దావా గురించి రాసుకొచ్చారని చెప్పారు. 70ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించామని, అతివలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *