స్థానిక ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్తుందట!

స్థానిక ఎన్నికల నిర్వహణపై కోర్టుకు వెళ్లే ఆలోచన ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు ఇప్పటికే. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో టీడీపీ అభ్యంతరాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తక్కువ అయ్యాయని టీడీపీ వాదిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేమో తమ పార్టీ తరఫున బీసీలకు అధిక సీట్లను కేటాయించి రిజర్వేషన్లను భర్తీ చేస్తామంటూ చెబుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం రిజర్వేషన్లు 59 శాతం ఉండాల్సిందే అని అంటోంది. దీని కోసం సుప్రీం కోర్టుకు వెళ్తుందట.

ఆ ప్రకటన సంగతలా ఉంటే.. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విషయంలో కూడా టీడీపీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది. ఈ విషయంలో కోర్టుకు వెళ్తుందట. ఒక రోజున ఎన్నికలను నిర్వహించి మధ్యలో ఫలితాలను వెళ్లడించి ఆ తర్వాత మరో ఎన్నికలు ఉన్నాయని టీడీపీ అంటోంది. ఎంపీటీసీ-జడ్పీ – మున్సిపల్ – పంచాయతీ ఎన్నికలు వరసగా ఉండటం పట్ల తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెబుతూ ఉంది. వీటిలో ఒకదాని ఫలితాల ప్రభావం మరో దాని మీద పడుతుందని చంద్రబాబు నాయుడు అంటున్నారు!

అందుకే ఈ విషయంలో టీడీపీ కోర్టుకు వెళ్తుందట. అయినా.. ఫలితాల ప్రభావం మరో ఎన్నికలపై ఉంటుందని కోర్టుకు వెళ్లడం ఏమిటో మరి! దాని వల్ల నష్టం ఏమిటి? ఇవేవీ సార్వత్రిక ఎన్నికలు కూడా కాదు. ఎలాగూ జగన్ పై వ్యతిరేకత తీవ్రంగా ఉందని చంద్రబాబు నాయుడే చెబుతున్నారు కదా అలాంటప్పుడు ఒక ఎన్నికల ప్రభావం మరో ఎన్నికలపై ఉంటుందని ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయని అనుకుందాం.. అప్పుడు మిగతా ఎన్నికలు వరసగా ఉండటం వల్ల లబ్ధి తెలుగుదేశం పార్టీ కే కదా!

ఇలాంటి నేపథ్యంలో షెడ్యూల్ విషయంలో కోర్టుకు వెళ్లడం మాత్రం తెలుగుదేశం పార్టీ బలహీనతను చాటుతూ ఉంది. ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీ భయపడుతూ ఉందనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్ పేరుతో ఎన్నికల వాయిదాను కోరడం ఇప్పుడు షెడ్యూల్ బాగోలేదంటూ కోర్టుకు వెళ్లే ప్రకటనలు చేయడం.. ఆ పార్టీకి నిజంగానే ఎన్నికలంటే భయమేమో అనే అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *