స్థానిక ఎన్నికల ప్రక్రియ 6 వరాలు వాయిదా

కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ ప్రకటించారు. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పటికే జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరుకానున్నారు. మనం పేపర్ బ్యాలెట్స్ వాడుతున్న నేపథ్యంలో, అధిక సమయం పడుతుంది. మనుషులకు మనుషులు తగిలే అవకాశం ఎక్కువ ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ముప్పు తప్పడం లేదు. ఎన్నికలు జరపడం ముఖ్యమైనా, ప్రజాభద్రతను పణంగా పెట్టకూడదనే వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవిస్తుంది. కానీ, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగానో, పాక్షికంగానో పూర్తయ్యాయి. అనేక వ్యయ ప్రయాసలను అధిగమించి ఏర్పాట్లు చేపట్టాం. సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు చేశాం. కానీ, విధిలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా, పంచాయతీ రాజ్ చట్టం ద్వారా సంక్రమించిన విస్త్రత, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నాం.

ఇది కేవలం నిలిపివేత మాత్రమే. రద్దు కాదు. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. ఆరు వారాల తర్వాత సమీక్ష తర్వాత వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లు అవసరమైన మేరకు సవరిస్తాం. పంచాయతీ ఎన్నికలకు ఆరు వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాం.’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వ్యక్తిగత పథకాలకు నిషేధం వర్తిస్తుందని, ప్రభుత్వ దైనందిన కార్యక్రమాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు. కావాల్సిన చోట రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం స్పష్టత కూడా ఇస్తుందని చెప్పారు.

ఎన్నికల్లో పోటీ చేసిన వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గ్రామ వాలంటీర్లు తీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత వారి మీదే ఉందని స్పష్టం చేశారు. ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఈనెల 23న మున్సిపల్ ఎన్నికలు, 27న పంచాయతీ ఎన్నికల తొలి విడుత, 29న పంచాయతీ ఎన్నికల తుది విడుత ఎన్నికలు జరపాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *