హైకోర్టు లో పిటిషన్ దాఖలైన ఎన్నికల పంచాయతీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన అంశంపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. వెంటనే ఎన్నికలు జరిపించాలని పిటిషన్‌లో కోరారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోవైపు… గవర్నర్ విశ్వభూషణ్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్… ఎందుకు ఎన్నికల్ని వాయిదా వేసిందీ వివరించారు.

ప్రజలు, మీడియాకు ఈ విషయంపై సమాచారం ఇవ్వాలనుకుంటే… దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేస్తామన్నారు. ఐతే… ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదని గవర్నర్ 45 నిమిషాలు జరిగిన భేటీలో అడిగినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉందనీ, అలాగే… కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతుంటే… నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రాలేని పరిస్థితులు ఉండటం వల్లే ఎన్నికల్ని వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ చెప్పినట్లు తెలిసింది.

ప్రధానంగా గుంటూరు, చిత్తూరు జిల్లాలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరిగాయనీ దీనిపై చర్యలు తీసుకున్నామని ఎస్ఈసీ తెలిపారు. ఓవరాల్‌గా అటు ప్రభుత్వ వాదన, ఇటు ఎస్ఈసీ వాదనల్ని క్రోడీకరించి గవర్నర్… ఓ రిపోర్టును కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది.

ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే, వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఉండి ఎందుకని, కనీస సమాచారం లేకుండా ఎలా వాయిదా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మరో ఆసక్తికర ఘటన ఏపీలో జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు అన్ని పూర్తయ్యాయని వెల్లడించారు.

ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదని, కరోనా కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని లేఖలో సీఎస్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *