హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు బంద్

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్… ఈ పేరు వినగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేవి కోచింగ్‌ సెంటర్లు. అక్కడి కోచింగ్‌ సెంటర్లలో వందల సంఖ్యలో విద్యార్థులు కోచింగ్‌ తీసుకుంటున్నారు. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారితో అమీర్‌పేట్‌ ప్రాంతం కిలకిటలాడుతూ రద్దీగా ఉంటుంది. వీరిపై ఆధారపడి ఎన్నో హస్టళ్లు అక్కడ వెలిశాయి.

అలాంటి అమీర్‌పేట్‌పై ‘కరోనా’.. తన పంజా విసిరింది. కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. అమీర్‌పేట్‌లో ఉన్న దాదాపు 850 హాస్టళ్లు, ఐటీ కోచింగ్‌ సెంటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఆదేశించింది. ఈ మేరకు ఆయా హాస్టళ్లు, శిక్షణా సంస్థల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేశారు.

రేపటి నుంచి హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను స్వస్థలాలకు పంపించాల్సిందిగా అధికారులు నిర్వాహకులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులను కాదని ఎవరైనా నిర్వాహకులు కోచింగ్‌ సెంటర్లు, వసతి గృహాలను నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *