2.5కేజీ ల బంగారం నగలు స్వాధీనం :ఎస్ పి సత్య ఏసు

తాడిపత్రి చోరీ ఘటన ఛేదింపు… 8 మంది ముఠా సభ్యులు అరెస్టు

* సుమారు 2.5 కె.జి ల బంగారు నగలు, 6 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం
* రికవరీ సొత్తు విలువ రూ. కోటి పైబడి ఉంటుంది
* సరైన బిల్లులు లేనందున ఐ.టి డిపార్టమెంటుకు రికవరీ సొత్తు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఇటీవల జరిగిన భారీ చోరీ ఘటనను తాడిపత్రి పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన 8 మంది ముఠాను అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 2.537 కె.జి ల బంగారు నగలు, 6 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ సొత్తుల విలువ సుమారు కోటి రూపాయల పైమాటే. ఈ ముఠా మూడు బృందాలుగా ఏర్పడి పక్కా ప్రణాళికలతో పాల్పడిన ఈ చోరీ కేసును పోలీసులు చాకచక్యంతో ఛేదించారు. గురువారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

** అరెస్టయిన ముఠా సభ్యుల వివరాలు….

1) గుత్తి మల్లికార్జున, వయస్సు 26 సం., అంకిరెడ్డిపల్లి, కొలిమిగుండ్ల మం.,కర్నూలు జిల్లా.
2)కొప్పుల కృష్ణమోహన్ రెడ్డి @ నాని, వయస్సు 24 సం.,అంకిరెడ్డిపల్లి, కొలిమిగుండ్ల మం.,కర్నూలు జిల్లా.
3) మల్లయ్యగారి మునిస్వామి, వయస్సు 23 సం., అంకిరెడ్డిపల్లి, కొలిమిగుండ్ల మం.,కర్నూలు జిల్లా.
4) తలారి సుధీర్ కుమార్ , వయస్సు 24 సం., అంకిరెడ్డిపల్లి, కొలిమిగుండ్ల మం.,కర్నూలు జిల్లా.
5)నస్రుద్దీన్ షబ్బీర్ @ షబ్బీర్ , వయస్సు 33 సం., టైలర్స్ కాలనీ, తాడిపత్రి పట్టణం
6) మహమ్మద్ మగ్దుమ్ , వయస్సు 33 సం., తాడిపత్రి పట్టణం
7) మంజుల ఆంజనేయులు @ అంజి, వయస్సు 24 సం.,అంకిరెడ్డిపల్లి, కొలిమిగుండ్ల మం.,కర్నూలు జిల్లా.
8) శింగమనేని హరికృష్ణ, వయస్సు 24 సం., రావివెంకటాంపల్లి గ్రామం, తాడిపత్రి మండలం.

** స్వాధీనం చేసుకున్నవి :

* 2.537 కె.జి ల ( 2537 గ్రాములు)బంగారు ఆభరణాలు, 6 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు ( వీటన్నింటి విలువ కోటి రూపాయల పైమాటే )

* దొంగతనం జరిగింది ఇలా….

నెల్లూరు పట్టణం కోటమిట్టకు చెందిన షఫీ, అబ్దుల్ రహీంల్ అన్నదమ్ములు. ఇరువురు బంగారు వ్యాపారస్తులు. నెల్లూరు నుండీ బంగారు తీసుకొచ్చి తాడిపత్రి పట్టణంలోని వివిధ జ్యువెలరీ షాపులకు విక్రయిస్తారు. ఇందులో భాగంగానే …ఈ ఇద్దరూ బంగారు ఆభరణాలు తీసుకుని గత నెల 27 వ తేదీ ఉదయం తాడిపత్రి పట్టణానికి వచ్చారు. వివిధ వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల నుండీ వచ్చే వ్యాపారస్తుల బస కోసం ఏర్పాటు చేసిన గదిలో దిగారు. ఆరోజంతా పట్టణంలో తిరిగి జ్యువెలరీ దుకాణాల్లో కొన్ని బంగారు అభరణాలు విక్రయించుకున్నారు. మరుసటి రోజు మధ్యహ్నాం వరకు ఇదే పనిలో ఉన్నారు. 28-01-2020 మధ్యహ్నాం సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు బంగారు ఆభరణాలు కల్గిన కవర్ లను చేతుల్లో పట్టుకుని నడుచుకుంటూ ఓం శాంతి నగర్ లోని ఓ హోటల్ కు భోజనానికి వెళ్తున్నారు. అదే అదునుగా భావించిన ముగ్గురు దుండగులు ద్విచక్ర వాహనంపై వెనుక వైపు నుండి వచ్చి అబ్దుల్ రహీం చేతిలో ఉన్న కవర్ లాక్కుని అక్కడి నుండి పరారయ్యారు. ఆ కవర్ లో సుమారు 3 కె.జి ల వరకు బంగారు ఆభరణాలు ఉంటాయి. ఈమేరకు ఫిర్యాదు చేయడంతో తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.

** కేసు ఛేదింపును సవాలుగా తీసుకున్న పోలీసులు
పట్ట పగలు, మిట్ట మధ్యహ్నాం జన సమ్మర్థమున్న తాడిపత్రి పట్టణంలో జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు …తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు పర్యవేక్షణలో సి.ఐలు తేజోమూర్తి, వహీద్ ఖాన్ , శ్యాంరావు, తేజోమూర్తి…ఎస్ ఐ లు ఖాజా హుస్సేన్ , ప్రదీప్ , చలపతి, ఏఎస్సై రామకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు జాకీర్ , మనోహర్ , కానిస్టేబుళ్లు జగదీశ్వర్ రెడ్డి, ఫరూక్ , చాంద్ , రిజ్వానా, శీను నాయక్ , మూర్తి, అరుణ్ , అనిల్ లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పక్కాగా రాబడిన సమాచారంతో ఈ ఎనిమిది మంది ముఠాను అరెస్టు చేశారు. విచారణలో పలు వాస్తవాలు వెలుగు చూశాయి.
** నేపథ్యం…
ప్రస్తుతం అరెస్టయిన 8 మంది ముఠా మూడు బృందాలుగా ఏర్పడి పకడ్బందీ ప్రణాళికతో దొంగతనం చేశారు. క్షేత్ర స్థాయిలో దొంగతనం చేసేందుకు ” పికప్ పార్టీ “గా గుత్తి మల్లికార్జున, నాని, మల్లయ్యగారి మునిస్వామిలు…. ఇద్దరు బంగారు వ్యాపారుల సమాచారం ఎప్పటికప్పుడు చేరేవేసేందుకు ” “ఇన్ఫమేషన్ బృందం”గా అంజి, శింగమనేని హరికృష్ణలు…, ఈ రెండు బృందాలను సమన్వయం చేసుకుంటూ పథకం పక్కాగా అమలయ్యేందుకు ” కోఆర్డినేషన్ / మానిటరింగ్ పార్టీ” గా తలారి సుధీర్ కుమార్ , షబ్బీర్ , మహమ్మద్ మగ్దుమ్ లు ప్రత్యేక బృందాలు ఏర్పడ్డారు.
ఈ ఎనిమిది మంది ముఠాలో షబ్బీర్ అసలైన వ్యూహకర్త. ఇతను తాడిపత్రి పట్టణంలోని మేడా జ్యువెలరీ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. నెల్లూరు నుండి బంగారు ఆభరణాలు తీసుకొచ్చి పట్టణంలోని జ్యువెలరీ దుకాణాల్లో విక్రయించడంపై సమగ్ర అవగాహన ఇతనికి ఉంది. బంగారు వ్యాపారం విషయమై ఎవరెవరు తాడిపత్రికి వచ్చి వెళ్తారనే విషయం ఇతనికి పక్కాగా తెలుసు. ఇతర ప్రాంతాల నుండి తాడిపత్రికి నామమాత్రపు బిల్లులతో వచ్చే బంగారు వ్యాపారుల నుండి చోరీ చేయాలనే ఆలోచన కల్గింది. తన స్నేహితులైన తలారి సుధీర్ కుమార్ , మహమ్మద్ మగ్దుమ్ లతో చర్చించాడు. జల్సాలకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వీరిద్దరు కూడా చోరీ చేసేందుకు అంగీకరించి మిగితా వారిని చేరదీశారు. జనవరి 27 వ తేదీ రాత్రి పుట్లూరు రోడ్డులోని ఓ హోటల్ లో అందరూ కలసి వ్యూహరచన చేశారు. పకడ్బందీగా చోరీ ఎలా చేయాలో పథకం రూపొందించారు. పికప్ పార్టీ, కోఆర్డినేషన్ / మానిటరింగ్ పార్టీ , ఇన్ఫమేషన్ పార్టీలుగా ఏర్పడ్డారు. ఆ మరుసటి రోజైన 28 వ తేదీ నెల్లూరు వ్యాపారులను అనుసరించి మధ్యహ్నాం చోరీ చేశారు. అక్కడి నుండి పరారై సరిహద్దు ప్రాంతమైన కంబగిరి దేవస్థానంకు అందరూ చేరుకుని చెరో కొన్ని నగలు తాత్కాలికంగా పంచుకుని తిరిగి నిన్నటి రోజున అందరూ సమానంగా పంచుకునేందుకు సమావేశమవగా పక్కా సమాచారంతో పోలీసు బృందాలు పట్టుకున్నారు.
** కొసమెరుపు… పోలీసులు గుర్తించకుండా ఉండేలా క్షేత్ర స్థాయిలో చోరీకి పాల్పడిన పికప్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు కసాపురంలో గుండు గీయించుకున్నారు. చోరీ చేయడానికంటే మునుపు చాలా సార్లు ఘటనా స్థలంలో ఎక్కువ సార్లు తిరగాడినట్లు సి.సి ఫుటేజీల్లో తెలుస్తుందని … ఈ విషయంలో పోలీసులు ప్రశ్నిస్తారని భావించి తిరగాడిన ప్రాంతంలోని ఓ దుకాణంలో షబ్బీర్ కు చెందిన బంగారు నగలు కూడా ఎక్కువసార్లు తిరగాడిన ఇద్దరు సభ్యులు కుదవపెట్టారు.
** ప్రశంస… పట్టపగలు తాడిపత్రి పట్టణంలో జరిగిన భారీ దొంగతనాన్ని చాకచక్యంగా ఛేదించిన తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు పర్యవేక్షణలో సి.ఐలు తేజోమూర్తి, వహీద్ ఖాన్ , శ్యాంరావు…ఎస్ ఐ లు ఖాజా హుస్సేన్ , ప్రదీప్ , చలపతి, ఏఎస్సై రామకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు జాకీర్ , మనోహర్ , కానిస్టేబుళ్లు జగదీశ్వర్ రెడ్డి, ఫరూక్ , చాంద్ , రిజ్వానా, శీను నాయక్ , మూర్తి, అరుణ్ , అనిల్ లను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *