పెళ్లి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న యువతి

thesakshi.com   :     తన పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నందుకు మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఐలాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన పైడాకుల బాలయ్య, గంగామణి దంపతుల కూతురు మహేశ్వరి(18) ఇటీవలే ఇంటర్ పూర్తిచేసింది.

పైచదువులు చదివించే స్థోమత లేకపోవడంతో ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఓ యువకుడితో వివాహం నిశ్చయించి.. ఆగస్టు 9న పెళ్లికి ముహూర్తం పెట్టారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో అప్పు చేయాలనుకున్నారు.

అయితే ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో ఈ నెల 27న బాలయ్య, గంగామణి గొడవపడ్డారు. తన పెళ్లి కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి మనస్తాపం చెందిన మహేశ్వరి శనివారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. మృతురాలి తల్లి గంగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *