‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ మూవీ రివ్యూ

వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ముందు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో తెరకెక్కి సెన్సార్ సమస్యల కారణంగా పేరు మార్చుకున్న చిత్రమిది. ఆంధ్రప్రదేశ్ సమకాలీన రాజకీయాల నేపథ్యంలో వర్మ అతడి శిష్యుడు సిద్దార్థ తాతోలు కలిసి తీసిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: ఆంధ్రప్రదేశ్ ను ఏలుతున్న వెలుగుదేశం పార్టీ.. దాని అధినేత బాబుకు చెక్ పెట్టి జగన్నాథ రెడ్డి అనే కొత్త నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కుతాడు. కానీ కొత్త సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్ష నేత.. ఆయన అనుయాయులు ఏదో ఒక అడ్డంకి సృష్టిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా అనేక కుట్రలూ జరుగుతాయి. ఈ క్రమంలో బాబుకు అత్యంత నమ్మకస్తుడైన ఓ నాయకుడు హత్యకు గురవుతాడు. అది ప్రభుత్వం మెడకు చుట్టుకుని ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తుంది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు వస్తాయి. మరి ఈ ఎన్నికల ఫలితమేంటి.. ఈ రాజకీయాలకు ముగింపేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఇంతకంటే పతనం కాలేడు అనుకున్న ప్రతిసారీ.. ఆ అంచనా తప్పు అని రుజువు చేయడం ఆయనకే చెల్లింది. ఇప్పటికే ఎన్నో నాసిరకం సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నే సినిమాతో వచ్చాడు. అదే.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు వేసే ట్రోల్స్ నే కథగా మలుచుకుని.. అక్కడ ఉండే మీమ్స్ నే పేర్చి దాన్నే కథనంగా మార్చి వర్మ తీసిన కళాఖండమిది. సినిమా అంటే ఇష్టపడేవాళ్లకు దీన్నొక సినిమా అనాలన్నా కూడా మనసొప్పదు. అంత నాన్-సీరియస్ గా.. నాసిరకంగా ఈ సినిమా తీశారు వర్మ.. అతడి శిష్యుడు సిద్దార్థ తాతోలు.

తాము తీసింది ఒక కల్పిత కథ అని.. నిజ జీవితంలో ఎవరితోనూ ఇందులోని పాత్రలకు పోలికలు లేవని.. సినిమా ఆరంభంలో చాలా పొడవైన డిస్క్లైమర్ వేశాడు వర్మ. అదో పెద్ద జోక్. చంద్రబాబు బదులు బాబు.. జగన్మోహన్ రెడ్డి బదులు జగన్నాథ రెడ్డి.. దేవినేని ఉమ బదులు దైనేని రమ.. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేతల్నే ప్రధాన పాత్రల్లో పేర్లు మార్చి చూపిస్తూ.. అర్థం పర్థం లేని కథా కథనాలతో.. సిల్లీ జోకులు.. సెటైర్లు.. పేరడీలతో ప్రేక్షకులు అసలేమాత్రం సీరియస్ గా తీసుకోలేని సినిమా అందించాడు వర్మ. అసలు ఇందులో కథ అంటూ ఒకటుందా అన్న సందేహం కూడా సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు కలుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఏడాది కాలంలో ఏం జరిగిందో అందరం చూస్తూనే ఉన్నాం. మళ్లీ దాన్నంతా వర్మ కెమెరా కంటితో చూస్తాం. ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం సాగించడం.. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం.. అసెంబ్లీలో రగడ.. ఆపై ప్రతిపక్ష పార్టీ అధినేత అవస్థలు.. ఇలా మనకు తెలిసిన విషయాల్నే చాలా పేలవమైన రీతిలో రీక్రియేట్ చేశాడు వర్మ. కనీస స్థాయిలో కూడా లేని నిర్మాణ విలువలు.. మిమిక్రీ వాయిస్ లతో సాగే డైలాగులు.. మొదలైన కాసేపటికే ప్రేక్షకులు సినిమాను లైట్ తీసుకునేలా చేస్తాయి.

నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని తీసిన పప్పు పాట.. లాంటివి అతడి వ్యతిరేకులకు నవ్వు తెప్పించవచ్చు. కేఏ పాల్ ను ఇమిటేట్ చేస్తూ సాగిన విన్యాసాలు కొందరికి కామెడీగా అనిపించవచ్చు. ఐతే ఇలాంటి పేరడీలు ట్విట్టర్లోనో.. యూట్యూబ్ లోనో అప్పుడప్పడూ చూసుకుని నవ్వుకోవడానికి ఓకే కానీ.. సినిమా అంతా ఇలాంటి స్పూఫులు.. పేరడీలతో నింపేస్తే దాన్ని ఒక సినిమాలా ఎలా తీసుకుంటాం? సినిమా అన్నాక ఒక కథ.. దాన్ని నేర్పుగా చెప్పే స్క్రీన్ ప్లే లాంటివి ఉండాలి కదా?

పాతికేళ్ల కిందట.. కెరీర్ ఆరంభంలోనే లెజెండరీ స్టేటస్ అందుకున్న వర్మ ఇలాంటి ప్రాథమిక విషయాలు కూడా పూర్తిగా మరిచిపోవడం విచారించాల్సిన విషయం. అయినా గత దశాబ్ద కాలంగా వర్మ తీస్తున్న సినిమాలు చూస్తున్నా కూడా ఇంకా ఆయన ఏదో విశేషం చూపిస్తాడని థియేటర్లకు వెళ్లడం పొరబాటని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ రుజువు చేస్తుంది. ఇది ఒక పార్టీకి అనుకూలంగా సాగిన ప్రాపగండా ఫిలిం అయినా సరే.. ఆ పార్టీ మద్దతుదారులు కూడా హర్షించేలా సినిమా సాగదు.

నటీనటులు: సినిమాలో నటించే అవకాశం ఎవరికీ రాలేదు. కేవలం నిజ జీవిత పాత్రల్ని అనుకరించడం మినహా ఎవ్వరూ ఏమీ చేసింది లేదు. ఆ అనుకరణలో మాత్రం అందరూ బాగానే చేశారనుకోవచ్చు. నారా లోకేష్.. పవన్ కళ్యాణ్.. కేఏ పాల్ పాత్రల్లో కనిపించిన నటులు ఈ పని బాగా చేశారు. అజ్మల్ లాంటి కాస్త పేరున్న నటుడు ఇంత నాన్ సీరియస్ సినిమాలో జగన్ పాత్ర చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడా అనిపిస్తుంది. చంద్రబాబు పాత్రలో కనిపించిన నటుడు లుక్ పరంగా ఓకే అనిపించాడు కానీ.. అంతకుమించి ఏమీ చేయలేదు. ఆలీ బ్రహ్మానందం లాంటి సీనియర్ నటులు ఇలాంటి సినిమాలో నటించి పేరు చెడగొట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు.

సాంకేతికవర్గం: టెక్నికల్ గా చాలా చీప్ గా అనిపిస్తుందీ సినిమా. ఒకప్పుడు వర్మ తీసిన సీరియస్ యాక్షన్ సినిమాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్న రవిశంకర్.. పడిపోతున్న వర్మ స్థాయికి తగ్గట్లే తాను కూడా ఔట్ పుట్ ఇస్తున్నట్లున్నాడు. పాటలు.. నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సన్నివేశాలకు సరిపడని లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అతను విసిగించేశాడు. జగదీష్ చీకటి ఛాయాగ్రహణం కూడా ఇలాగే సాగింది. వర్మ స్టయిల్లో చిత్రమైన కెమెరా యాంగిల్స్ తో అతను కూడా చికాకు పెట్టాడు. నిర్మాణ విలువలు నాసిరకంగా ఉన్నాయి. ఇక వర్మ గారి కథాకథనాల.. దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకప్పుడు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిన ఆయన.. ఇప్పుడు ‘సినిమా’ను ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో.. దాన్నెంతగా కించపరిచే ప్రయత్నం చేస్తున్నారో చెప్పడానికి ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా మరో రుజువుగా నిలుస్తుంది.

చివరగా: అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు..సినిమా కాదు స్క్రాప్

రేటింగ్-1.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *