రూ.52వేల కోట్ల నష్టపోయిన ఫేస్‌‍బుక్

thesakshi.com    :    టిక్‌టాక్‌పై ఎంతలా విమర్శలు ఉన్నాయో… ఫేస్‌బుక్ పైనా అంతలా ఉన్నాయి. ఎన్నో నేరాలకు కూడా ఫేస్‌బుక్ కారణమవుతోంది. తాజా సమస్యేంటి?

మీరు ఫేస్‌బుక్ వాడుతున్నట్లైతే… మీకు తరచుగా అర్థం పర్ధం లేని యాడ్స్ వస్తూ ఉంటాయి. అసత్య వార్తలు, హేట్ స్పీచ్ వంటివి కనిపిస్తుంటాయి. ఇక బూతు పురాణమూ ఎక్కువే. వీటన్నింటినీ అడ్డుకోవడానికి ప్రతీ పోస్ట్‌కీ రిపోర్ట్ అనే ఆప్షన్ ఇచ్చామనీ… దాని ద్వారా నెటిజన్లు కంప్లైంట్ ఇస్తే… నిజానిజాల్ని పరిశీలించి తప్పుడు పోస్టుల్ని తొలగిస్తున్నామని ఫేస్‌బుక్ చెబుతోంది. ఐతే… ఇలా నెటిజన్లు కంప్లైంట్ ఇచ్చేవరకూ ఆగకుండా… మీరే స్వయంగా వాటిని ఎందుకు ఆపరు అంటూ… ఫేస్‌బుక్‌కి యాడ్స్ ఇస్తున్న కంపెనీలు మండిపడ్డాయి. అసత్య వార్తల వల్ల… ఫేస్‌బుక్‌పై ప్రజలకు నమ్మకం పోతోందనీ… ఆ ప్రభావం తమ యాడ్స్‌పైనా పడుతోందని కంపెనీలు భగ్గుమన్నాయి.

అనడమే కాదు… తమ యాడ్స్‌ని తొలగించాలని నిర్ణయించుకున్నాయి కూడా. మొత్తం 160కి పైగా కంపెనీలు… ఫేస్‌బుక్‌కి గుడ్‌బై చెప్పాలని డిసైడయ్యాయి. ఫలితంగా ఫేస్‌‍బుక్ షేర్ల విలువ ఒక్కసారిగా పడిపోయింది. దాదాపు రూ.52వేల కోట్ల నష్టం వచ్చింది.

యాడ్స్ ఆపేయాలనుకున్న కంపెనీల్లో చాలా వరకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నవే. కోకాకోలా, స్టార్ బక్స్ వంటి కంపెనీలు జులై నుంచి యాడ్స్ ఇచ్చేది లేదన్నాయి. ప్రధానంగా అమెరికాలో తీవ్ర దుమారం రేపిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత… నల్లజాతీయులకు వ్యతిరేకంగా వస్తున్న హింసాత్మక పోస్టుల్ని తీసేయడంలో ఫేస్‌బుక్ విఫలమైందని కంపెనీలు ఫైర్ అవుతున్నాయి.

ఈ లిస్టులో యూనీలివర్, అవుట్ డోర్ అపెరల్, పాటగోనియా, ది నార్త్ ఫేస్, ఎడ్డీ బుయర్ ఇలా చాలా ఉన్నాయి. మంగోలియా పిక్చర్స్, హోండా, లెవీ స్టారస్ వంటి కంపెనీలు కూడా యాడ్స్ ఆపేశాయి.

కంపెనీల నిర్ణయంతో ఫేస్‌బుక్‌లో ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లాగా తమ సంస్థ కూడా కచ్చితమైన రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో యాడ్స్ ద్వారా ఫేస్‌బుక్… రూ.80వేల కోట్లు సంపాదించింది.

ఈసారి కరోనా ఎఫెక్టుకి తోడు… కంపెనీల నిర్ణయంతో… భారీగా ఆదాయం నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. తాజాగా దుమారంపై ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు. ఇకపై సరైన ఆధారాలతో సమాచారం ఉంటేనే పోస్టుల్ని అనుమతిస్తామనీ… హింసాత్మక పోస్టులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మరిన్ని టూల్స్ తెచ్చి… ప్రక్షాళన చేస్తామన్నారు. నిజంగా అలా జరిగితే… ఫేస్‌బుక్ వల్ల కలుగుతున్న నష్టాలు, నేరాలకు కొంతవరకూ బ్రేక్ పడే అవకాశాలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *