కేబుల్ టీవీ టెక్నీషియన్‌గా వెళ్లి హత్య, చోరీ..!

thesakshi.com   :    కేబుల్ టీవీ టెక్నీషియన్ అని చెప్పి , సెట్ టాప్ బాక్స్‌ను రీఛార్జ్ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ఒక వ్యక్తి 38 ఏళ్ల దంత వైద్యురాలిని హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆమె ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఊహించని విధంగా ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. డాక్టర్ నిషా సింఘాల్ పై సెట్ టాప్ బాక్స్ రీఛార్జ్ చేయడానికి వచ్చిన వ్యక్తి కత్తితో దాడి చేసి ఆమె గొంతు దారుణంగా కోశాడు. ఈ ఘటనలో ఆమె మృతి చెందగా, డాక్టర్ సింఘాల్ యొక్క ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయట పడ్డారు.

ఆగ్రాలోని కమల్‌నగర్‌లో పట్టపగలు డాక్టర్ నిషా సింఘాల్‌ను హత్య చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న డాక్టర్ నిషా యొక్క పిల్లలు అనిషా మరియు అద్వయ్ పక్కనే ఉన్న గదిలో నుండి జరిగింది చూశారు . టీవీ రీఛార్జ్ కోసం వచ్చిన యువకుడు అమ్మను చంపేస్తానని చెప్పాడని , తరువాత వెంటనే కత్తితో గొంతు కోసి చంపాడని పిల్లలు పోలీసులకు చెప్పారు.

డాక్టర్ నిషా సింఘాల్ పై దాడి చేసిన ఆగంతకుడు , పిల్లలపై కూడా దాడి చేశాడు . వారి మెడపై కత్తితో పొడిచి గాయపరిచాడు .అయితే పిల్లలు దాడి జరిగినప్పటికీ ప్రాణాలతో బయట పడ్డారు. నిషా సింఘాల్ యొక్క పెద్ద పాప 8 సంవత్సరాల వయస్సు కాగా, చిన్న కుమారుడు నాలుగు సంవత్సరాల వయస్సు . తల్లి డాక్టర్ నిషా సింఘాల్ హత్య జరుగుతున్న సమయంలో వారిద్దరూ వేరొక గదిలో ఉన్నారు. డాక్టర్ సింఘాల్ భర్త అజయ్ సింఘాల్ సర్జన్ గా పని చేస్తున్నారు. దాడి సమయంలో ఆసుపత్రిలో ఆయన విధుల్లో ఉన్నారు.

భార్య దారుణ హత్య ఘటన తెలుసుకున్న తర్వాత ఇంటికి వెళ్లిన అజయ్ సింఘాల్ తీవ్ర రక్తస్రావం అవుతున్న భార్యను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారగా ఆమె మృతి చెందారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు, నిందితుడి పేరు శుభం పాథక్ అని పేర్కొన్నారు . అతన్ని ఈ ఉదయం అరెస్టు చేసిన పోలీసులు అతని నుండి అసలు విషయాన్ని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

కేబుల్ టీవీ టెక్నీషియన్‌గా నటిస్తూ సింఘాల్ నివాసంలోకి వెళ్ళిన నిందితుడు ఇంటిని దోచుకోవాలని ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆగ్రాలోని కమల్‌నగర్‌లో డెంటిస్ట్ నిషా సింఘాల్‌ను హత్య చేసి ఆమె ఇంటిని దోచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శుభం పాథక్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కాళింది విహార్ 100 ఫీట్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసుల దాడిలో అతని కుడి కాలుకు బుల్లెట్ గాయమైంది . పోలీసులు అతని నుంచి దొంగిలించిన సొత్తును, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *