సీబీఐకి లోకేశ్ చిక్కినట్టేనా?

thesakshi.com  :   వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పకడ్బందీగా రచిస్తున్న మాస్టర్ ప్లాన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేశ్ దొరికేసినట్టేనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినంతనే… అంతకుముందు టీడీపీ పాలనలో చోటుచేసుకున్న కీలక పరిణామాలపై వరుస పెట్టి దర్యాప్తులకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం ఒకటి.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లుగా జగన్ సర్కారు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే నిగ్గు తేల్చింది. ఏకంగా రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నివేదికతో పాటు ఫైబర్ నెట్ కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలతో జగన్ సర్కారు ఏకంగా ఓ నివేదికను రూపొందించిందన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

భారీ ఎత్తున అక్రమాలు జరిగిన ఈ వ్యవహారంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్ జగన్ నేరుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు ఇప్పటికే ఓ లేఖ రాశారన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఫైబర్ నెట్ పనుల కాంట్రాక్టులను ఇటు ఏపీ ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్టర్ ను మార్చినట్లుగా తేలినట్లు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి.

తొలి కాంట్రాక్టర్ కంటే కూడా రెండో సారి ఎంట్రీ ఇచ్చిన కాంట్రాక్టర్ కు ఏకంగా 11 శాతానికి పైగా ఎక్సెస్ రేట్లకు టెండర్ ను కట్టబెట్టినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మొత్తం వ్యవహారం నాడు ఐటీ శాఖ మంత్రిగా కొనసాగిన నారా లోకేశ్ సూచన మేరకు అప్పటి ఫైబర్ నెట్ ఎండీగా కొనసాగిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ చక్కబెట్టినట్టుగా జగన్ సర్కారు తేల్చినట్లుగా కూడా సమాచారం.

మొత్తంగా లోకేశ్ ను నేరుగా ఇరికించేలా పక్కాగా ఆధారాలు సేకరించిన జగన్ సర్కారు… సదరు నివేదికను మోదీ సర్కారుకు పంపడంతో పాటుగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరిందట.

ఇదిలా ఉంటే… బీజేపీకి చెందిన ఏపీ నేతలు కూడా టీడీపీ అవినీతి అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నారు. మొత్తంగా అటు జగన్ ఇటు ఏపీ బీజేపీ నేతలు కోరినట్లుగా మోదీ సర్కారు దీనిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తే… లోకేశ్ తప్పకుండా జగన్ ఉచ్చుకు చిక్కుతారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *