జేసీ ట్రావెల్స్ పై రూ 100 కోట్లు జరిమానా… !!

తప్పుడు సమాచారం ఇచ్చిన జేసీ ట్రావెల్స్‌పై సుమారు రూ.100 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు అన్నారు. అంతేకాక జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్‌-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం 2017 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. కానీ దీనికి విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్‌-3 వాహనాలు గుర్తించామని తెలిపారు. అయితే వీటిని స్క్రాబ్‌ కింద విక్రయించామని అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తమకు వివరాలు పంపిందని వెల్లడించారు.

సుప్రీం నిబంధనలకు విరుద్ధంగా..
‘నాగాలాండ్‌లో బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా మార్చారు. ఇందులో ఆరు వాహనాలు జేసీ దివాకర్‌ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్‌ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ జరిగాయి. ఒక వాహనం జేసీ ట్రావెల్స్‌ సంస్థ జటాధర ఇండస్ట్రీస్ పేరిట రిజిస్టరయ్యాయి. మరో నాలుగు లారీలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి సతీమణి జేసీ ఉమారెడ్డి పేరిట రిజిస్టరయ్యాయి. దీనిపై వన్‌టౌన్‌ పీఎస్‌లో జేసీపై ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న జేసీ ట్రావెల్స్‌పై విచారణ చేయాలని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పర్మిట్లు లేని వ్యవహారంతోపాటు, ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీతో జేసీ బ్రదర్స్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజా ఫిర్యాదుతో రవాణాశాఖ ఉన్నతాధికారులు జేసీ ట్రావెల్స్‌ అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *