నీట్ పరీక్ష ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య!

thesakshi.com   :   మదురైలో ‘నీట్‌’కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థినితో పాటు ధర్మపురికి చెందిన మరో విద్యార్థి పరీక్ష భయంతో ఉరి వేసుకోవడం విషాదానికి దారి తీసింది.

దీవతో రాష్ట్రంలో గత మూడేళ్లలో నీట్‌ పరీక్షల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పదికి పెరిగింది. ఈనెల 13న ఆదివారం నీట్‌ జరుగనున్న క్రమంలో  విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది.

మదురై రిజర్వు లైన్‌ ప్రాంతంలో సాయుధదళం క్వార్టర్స్‌లో నివసిస్తున్న ఆరో బెటాలియన్‌లో ఇన్‌స్పెక్టర్‌ మురుగసుందరం కుమార్తె జ్యోతి శ్రీదుర్గా(18) గత రెండేళ్లుగా నీట్‌కు  శిక్షణ తీసుకుంటోంది.

2019 అరుప్పుకోటలోని పాఠశాలలో ప్లస్‌-2 పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో గత యేడాది నీట్‌లో ఉత్తీర్ణత సాధించ లేకపోయింది.

మళ్లీ ఈ యేడాది నీట్‌కు సిద్ధమవుతున్నప్పటికీ ఆ పరీక్షలను రద్దు చేసి వైద్య కోర్సుల్లో ప్రవేశం లభిస్తుందని ఆశపడింది. చివరకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 13న కరోనా నిబంధనల నడుమ నీట్‌ జరుపుతామని ప్రకటించడంతో కలత చెందింది.

నీట్‌కు సక్రమంగా సిద్ధం కాలేదన్న దిగులుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. శుక్రవారం రాత్రి జ్యోతిశ్రీ  తన తండ్రి మురుగసుందరంతో మాట్లాడింది.

ఈ యేడాది కూడా నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేనని చెప్పింది.  ముందు  పరీక్ష రాయమని… పాసైనా ఫెయిల్‌ అయినా ఫరవాలేదని ఆయన కుమార్తెను ఓదార్చారు.

ఈ పరిస్థితుల్లో రాత్రంతా మానసిక ఒత్తిడికి గురైన జ్యోతిశ్రీ శనివారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

వేకువజాము 4.30 గంటలకు జ్యోతిశ్రీకి కాఫీ ఇవ్వడానికి వెళ్లిన కుటుంబీకులకు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతుండటం చూసి  బోరున విలపించారు.

సమాచారం అందుకున్న మదురై తల్లాకుళం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

ఈ సందర్భంగా  జ్యోతిశ్రీ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ లేఖ రాసిపెట్టడంతోపాటు తన బాధను ఆడియోగా ఫోన్‌లో పొందుపరచినట్టు పోలీసులు గుర్తించారు.

రెండోసారి నీట్‌లో ఫెయిల్‌ అవుతాననే భయంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నానని, తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని, తమ్ముడు శ్రీధర్‌ను బాగా చదివించమని  పేర్కొంది.

ఇక ధర్మపురికి చెందిన ఆదిత్య(18) కూడా శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో ఉరి వేసుకున్నాడు.

మంత్రి నివాళి
నీట్‌కు భయపడి విద్యార్థిని జ్యోతిశ్రీదుర్గా ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం తెలియగానే మదురైలోనే ఉన్న రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ దిగ్ర్భాంతి చెందారు.

హుటాహుటిన ఆయన అధికారులతోపాటు మదురై ఆస్పత్రికి వెళ్లి జ్యోతిశ్రీదుర్గా భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *