అయోధ్యలో రామమందిరం భూమి పూజకు వారికి అందని ఆహ్వానం

thesakshi.com    :    అయోధ్యలో రామమందిరం భూమి పూజకు బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఇంకా ఆహ్వానం అందలేదు.

అయితే, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్‌లకు ఆహ్వానం అందింది.

ఆగస్ట్ 5న అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్కే అద్వానీ గత వారం ఈ కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణకు వీడియో లింక్ ద్వారా హాజరయ్యారు.

సుమారు 4 గంటల పాటు జరిగిన విచారణలో సీబీఐ అధికారులు ఆయన్ను 1000 ప్రశ్నలు వేశారు. తనపై వచ్చిన ఆరోపణలను అద్వానీ తోసిపుచ్చినట్టు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అదే సీబీఐ కోర్టులో తన స్టేట్ మెంట్ ఇచ్చిన ఎంఎం జోషికి కూడా రామ మందిరం నిర్మాణానికి ఆహ్వానం అందలేదు.

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణలన్నీ కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని గతంలో ఆయన ప్రకటించారు.

మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషితోపాటు ఉమా భారతి కూడా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1990ల్లో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న ఉద్యమానికి ఎల్కే అద్వానీ నేతృత్వం వహించారు.

అద్వానీ, జోషి కళ్యాణ్ సింగ్, ఉమాభారతి లాంటి వారు ఇచ్చిన ఉద్రేకపూరితమైన స్పీచ్‌ల వల్ల కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో కేవలం 200 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానాలు పంపాలని గతంలో ట్రస్టు బోర్డు నిర్ణయించింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపుతామని ప్రకటించింది. అలాగే, ఆ రోజు దేశంలోని అన్ని రాయబార కార్యాలయాలకు మిఠాయిలు పంపనున్నారు. అందుకోసం భారీ ఎత్తున బికనీర్ లడ్డూలను ఆర్డర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *