తాళికట్టు శుభవేళ.. ఆగిన పెళ్లి..?

thesakshi.com    :   పెద్దలు కుదిర్చిన పెళ్లంటే… ఇటు ఏడు తరాలూ… అటు ఏడు తరాలూ చూస్తారని అంటారు… అన్ని చూసిన వాళ్లు… పిల్ల మనసులో ఏముందో చూడరా అంటే చూస్తారు. కానీ తమ పంతమే నెగ్గాలనుకుంటారు. కానీ చట్టం ఒకటుందిగా… అది మేజర్లకే ఓటేస్తుంది. దాంతో… ఇలా పీటల మీద జరగాల్సిన పెళ్లిళ్లు… పెటాకులవుతుంటాయి.

మరో ఐదు నిమిషాల్లో పెళ్లి. తాళి కట్టే సమయంలో బంధుమిత్రులు అక్షితలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తన పెళ్లి జరుగుతోందని వరుడు చాలా ఆనందంగా ఉన్నాడు. వధువు మాత్రం మౌనంగా ఉంది. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో… మొత్తం సీన్ మారిపోయింది.

వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన యువతికి… చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండకు చెందిన ఓ ఉద్యోగికి వివాహం సెట్టైంది. ముందుగా నిశ్చయించిన ముహూర్తానికే పెళ్ళి జరుగుతోంది. పెళ్లికి ముందు జరిగే రెసెప్షన్ కార్యక్రమం సజావుగా సాగింది. ఉదయం ముహూర్తం ఫిక్సైంది. ఇక తాళి కట్టడమే తరువాయి. ఇంతలో పెదరాయుడు సినిమాలో రజనీకాంత్‌లా…. “ఆపండి” అంటూ భారీ కేక. ఒక్కసారిగా భజంత్రీలు ఆగిపోయాయి. అందరూ అరుపు విన్నవైపు చూశారు. ఎదురుగా… పోలీసులతో ఓ యువకుడు. పెళ్లి కూతురు ముఖం ఫ్లడ్ లైట్‌లా వెలిగిపోయింది. ఆమె కుటుంబ సభ్యుల్లో ఆవేదన.

తమిళనాడులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది వధువు. అదే కంపెనీలో పనిచేస్తున్న తమిళ యువకుడిని ప్రేమించింది. ఇద్దరు లోతైన ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇది నచ్చని పెద్దలు యువతికి వేరే పెళ్లి ఫిక్స్ చేశారు. రిసెప్షన్ కూడా వైభవంగా జరిగి… నూతన వధువు, వరులను అంతా ఆశీర్వదించారు.

తన ప్రియురాలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ప్రియుడు అటు తమిళనాడు పోలీసులకు, ఇటు కడప పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వెంటనే ఓ హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ కల్యాణ మండపంలో అడుగుపెట్టి పెళ్లిని అడ్డుకున్నారు. వధువుని అడగ్గా… తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అంతే… వరుడు పీట పై నుంచి లేచి… ఆగ్రహంతో వెళ్లిపోయాడు. ఆ వెనకే అతని కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వెళ్లిపోయారు.

ప్రియుడి దగ్గరకు వెళ్లేందుకు వధువు ఇష్టపడింది. దాంతో ఆమె వాంగ్మూలాన్ని తహసీల్దార్ తీసుకొని… ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. నాటకీయ పరిణామాల మధ్య ప్రియుడు తన మిత్ర పరివారంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. ప్రియుడు, ప్రియురాలిని వారి తల్లితండ్రులని కడపకు తరలించారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *