కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ?

thesakshi.com    :    ఇప్పటికే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధంపై ఏపీలో దుమారం రేగుతోంది. ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినప్పటికీ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ క్రమంలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాల్లో మూడు మాయమయ్యాయి.

మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు తెలిసింది.

ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారు. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైనట్లు సమాచారం.

అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్‌తో సమావేశమై.. దుర్గగుడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపారు. అనంతరం ఆలయ ఈవో, ఇతర సిబ్బంది కలిసి రథాన్ని పరిశీలించారు.

అప్పుడు రథంపై మూడు వెండి సింహాలు మాయమైన విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నాలుగో సింహాన్ని కూడా ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినట్లు సమాచారం.

ఐతే అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. రథంపై ఉన్న సింహాలు మాయమయ్యాయని తాను అనుకోవడం లేదని దుర్గ గుడి ఈవో సురేశ్ తెలిపారు. అంతర్వేది ఘటన నేపథ్యంలో వెండి సింహాలు మాయమయ్యాయని దుష్ప్రచారం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.

రికార్డులు పరిశీలించకుండా సింహాలు ఉన్నదీ లేనిదీ ఎలా చెప్పగలమని ఆయన అన్నారు. తాను ఈవోగా వచ్చాక ఈ రథాన్ని వినియోగించలేదన్న ఆయన.. రథాన్ని, రికార్డులను పరిశీలించి సింహాలు గతంలో ఉన్నాయా లేవా తేల్చడానికి 3 రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

ఐతే రథంపై ఉన్న టార్పాలిన్‌ను తొలగించాలని మీడియా ప్రతినిధులు కోరడంతో అందుకు సిబ్బంది నిరాకరించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *