thesakshi.com : సీఎం జగన్ కేబినెట్ విస్తరణ కసరత్తు..
ఆ ఎమ్మెల్యేలకు పిలుపు ఒన్ టూ ఒన్ – ఫటా ఫట్..!!
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి 27 నెలలు పూర్తవుతోంది.
ఇప్పటికే పాలనా పరమైన అంశాలు-కరోనా కారణంగా పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టలేదు.
ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు అవకాశం దక్కటం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే,రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కారణంగా ఎమ్మెల్యేలు అడిగిన నిధులను మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది.
అయితే,ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయలను పార్టీ సమన్వయకర్తలు సీఎంకు వివరించారు.
ఇదే సమయంలో పాలనా పరంగా ప్రక్షాళనకు సీఎం జగన్ సిద్దమయ్యారు.
ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ముఖాముఖి…
అందులో భాగంగా.. ముందుగా తన కేబినెట్ విస్తరణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇందు కోసం సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఇందుకు సంబంధించి ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి- ఎమ్మెల్యేల పని తీరు వంటి వాటి పైన సీఎం అంతర్గత సర్వేలు చేయించారు.
వాటి నివేదికలను సిద్దం చేసుకున్నారు.
ఇక,జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలకు సమయం కేటాయించనున్నారు.
సర్వే నివేదికల ఆధారంగా క్లాస్..
ఆ సమయంలో ఎమ్మెల్యేలు అందరితో కాకుండా.. ఒన్ టు ఒన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటుగా వారి బలాలు- బలహీనతల పై సీఎం నేరుగా చర్చించనున్నారు.
ఆరోపణలు ఉన్న వారికి హెచ్చరికలు..పని తీరు బాగున్న వారికి దక్కే అవకాశాల గురించి సీఎం నేరుగా వారితోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం – ఎమ్మెల్యేల ఒన్ టు ఒన సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు- మంత్రులకు ఎవరూ లేకుండా ఎమ్మెల్యేలే నేరుగా సీఎంతో మాట్లాడే విధంగా అవకాశం కల్పించనున్నారు.
కేబినెట్ అవకాశాలపైన మనసులో మాట..
ఇక,పార్టీ- ప్రభుత్వం మధ్య సమన్వయం అదే విధంగా క్షేత్ర స్థాయిలో అధికారుల పైన వస్తున్న పార్టీ నేతల ఫిర్యాదుల విషయంలో నూ చర్చించే అవకాశం ఉంది.
ఇక,టార్గెట్ – 2024 లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు.
అందులో భాగంగా.. కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం తన అభిప్రాయాలను ఆశావాహ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
ముందుగా చెప్పిన విధంగా ప్రస్తుత కేబినెట్ లో 90 శాతం మందిని తప్పిస్తారా..లేక, మొత్తం కేబినెట్ నే మర్చేస్తారా అనే టెన్షన్ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతోంది.
ఇదే సమయం లో ఆశావాహులు సైతం సీఎం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు.
ఇచ్చేదెవరికి..దక్కనిదెవరికి..ఫుల్ క్లారిటీతో.. దీంతో..ప్రభుత్వంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చేస్తున్న కసరత్తు ఈ లోగానే పూర్తయ్యే అవకాశం ఉంది.
ఆ తరువాత ఈ సమీక్షల్లో ఆశావాహులకు సీఎం నేరుగా తన అభిప్రాయం చెప్పటంతో పాటుగా.. అవకాశం ఇవ్వలేని వారికి భవిష్యత్ పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
దీంతో..కేబినెట్ విస్తరణ సమయంలో ఏ ఒక్కరి నుంచి ఓపెన్ గా అసంతృప్తి బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అదే విధంగా..పార్టీ బాధ్యతల విషయంలో సీఎం మరింత స్పష్టంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
సీఎం జగన్ మిషన్ -2024..
అక్టోబర్ 2 నుంచి రచ్చబండ ద్వారా సాధ్యమైనంత కాలం ప్రజల్లో ఉండాలనేది సీఎం నిర్ణయం.
ఈ లోగానే ఎమ్మెల్యేలతో ఒన్ టు ఒన్ సమావేశాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
సీఎం ప్రజల్లోకి వెళ్లటం ద్వారా రానున్న రెండేళ్ల కాలంలో పూర్తిగా పార్టీ నేతలంతా ప్రజలతో మమేకం అయ్యేలా దిశా నిర్దేశం చేయటానికి సిద్దం అవుతున్నారు.
ఇక,ఇప్పుడు సీఎం తమతో నేరుగా మాట్లాడేందుకు సమయం కేటాయించటం పైన ఎమ్మెల్యేల్లో జోష్ కనిపిస్తోంది.
అదే విధంగా మంత్రి పదవుల పైన క్లారిటీ వచ్చే అకాశం ఉంది.
దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందా..
దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.
ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా అదికార పార్టీ నేతలే ఎక్కువగా ప్రజల్లో ఉండేలా సీఎం కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
అయితే,కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు..ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది.
దీంతో.. ముందుగానే సీఎం ఈ మొత్తం వ్యవహారం పైన క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు.