thesakshi.com : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు.. లోయలో పడిపోవడంతో పది మంది మరణించగా.. పలువురుకి గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు సన్నిధిలో కొత్త జీవితానికి అడుగులు పడుతున్నాయని ఎంతో ఉత్సాహంలో కనిపించాడు.. కాసేపటికే స్వామి వారి సన్నిధికి చేరుకుంటామని అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంతా కబుర్లు చెప్పుకుంటూ జర్నీ చేస్తున్నారు. కానీ ఊహించిన విధంగా వారి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వారి ఆనందం చూసి విధికి కన్నుకుట్టింది ఏమో.. హ్యాపీగా సాగిపోతున్న వారి జర్నీలో విషాదం నెలకొంది.
అతి వేగం.. అప్పటికే చుట్టూ చిమ్మ చీకట్లు ఉండడం.. అందులోనూ అంతా ఘాట్ రోడ్డు కావడంతో.. ముందు ఉన్న లోయ దగ్గర మలుపును డ్రైవర్ గుర్తించలేకపోయాడు. ఆ తరువాత గుర్తించినా.. అప్పటికే బస్సు అతి వేగంతో ఉండడంతో అదుపు తప్పింది.. పక్కనే ఉన్న 300 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు బోల్తా పడింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఊహించని విషాదం చోటు చేసుకుంది.
రెప్ప పాటు సమయంలోనే రోడ్డుపై బస్సులో వెళ్తున్న వారంతా.. లోయలో పడిపోయారు. సాయం కావాలంటూ వారి ఆర్తనాధాలు మిన్నంటాయి. ఈ ప్రమాదం ఘటనలో ఇప్పటికే 10 మంది మరణించినట్టు గుర్తించారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా లోని చంద్రగిరి మండలం భాకారపేట ఘాట్ రోడ్డులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
పూర్తిగా చీకటిగా ఉండడం.. బస్సు 300 అడుగుల లోయలో ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. అయినా అతి కష్టం మీద చాలామందిని పోలీసులు, స్థానికులు రక్షించి బయటకు తీశారు. బాధితులను అనంతపురం జిల్లా ధర్మవరం వాసులుగా గుర్తించారు. వీరంతా ధర్మవరం నుంచి తిరుపతికి బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు. వీరంతా ఎంగేజ్ మెంట్ కోసం తిరుపతి వస్తున్నారు. ఇవాళ ఎంగేజ్ మెంట్ జరగాల్సి ఉంది.
వారందరినీ బయటకు తీసిని క్షణాల్లోనే గాయపడిన వారిని అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన సమయంలో చిమ్మ చీకట్లు ఉండడంతో ఇంకా మరణాలపై పూర్తి క్లారిటీ రాలేదు. బాధితులు అంతా తీవ్ర గాయాలతో ఉండడంతో పూర్తి సమాచారం ఇంకా తెలియడం లేదు అంటున్నారు పోలీసులు.. డ్రైవర్ నిద్రలో వాహనం నడిపాడా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.