thesakshi.com : బిహార్లో కల్తీ మద్యం తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్లో నకిలీ మద్యం మరణాలు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది.
కల్తీ మద్యం ప్రాణాలు తీస్తోంది. వారం క్రితమే కల్లీ మద్యం తాగి గుజరాత్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాదం మరిచిపోకముందే, బిహార్‌లో కల్తీ మద్యం మరో 11 మంది ప్రాణాలు తీసింది.
బిహార్‌లోని సరన్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. సరన్ జిల్లాలోని మేకర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్వారియా పంచాయతి పరిధిలోని గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఒక కార్యక్రమంలో వారు ఈ కల్తీ మద్యం సేవించనట్లు సమాచారం. గురువారం రాత్రి నుంచి పలువురు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు లోనవడం ప్రారంభమైంది. ఈ కల్తీ మద్యం తయారు చేసినట్లు, అమ్మినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓను, స్థానిక చౌకీదారును సస్పెండ్ చేశారు. సమాచారం తెలియగానే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, వైద్యుల బృందం ఘటన జరిగిన గ్రామానికి చేరుకున్నారు. అస్వస్థతకు లోనయినవారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని పట్నాలోని పీఎంసీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ గ్రామంలో శ్రావణ మాసం ప్రారంభంలో మద్యం సేవించే ఆచారం ఉందని, ఆ ఆచారంలో భాగంగానే వారు ఈ కల్తీ మద్యం సేవించారని అధికారులు వెల్లడించారు. ఈ ఆచారం గురించి ముందే సమాచారం ఉన్నా, వారు కల్తీ మద్యం సేవించకుండా నిరోధించలేకపోయారన్న కారణంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓను, స్థానిక చౌకీదారును సస్పెండ్ చేశారు. బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధ అమల్లో ఉంది.