thesakshi.com : శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. రైలు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదించిన తాజా వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మృతులు ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించామని, మరో ముగ్గురిని కూడా వేరే రాష్ట్రానికి చెందిన వారు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.
కాగా, ఘటనలో గాయపడిన వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకొచ్చి వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకున్నారని వివరించారు. కలెక్టర్ స్వయంగా రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుడికి అందుతున్న వైద్యాన్ని పరిశీలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించగా అక్కడ అందుతున్న చికిత్సను కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మృతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు అందజేయాలని, తక్షణమే సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.