thesakshi.com : ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే అనంత ఆగ్రహం…
ప్రతీదీ రాజకీయం చేయడమే మీ పనా?
ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేదా అని ప్రశ్న…
మహిళా సంఘాలను మోసం చేసిన చంద్రబాబు..
రుణమాఫీ పేరుతో కుచ్చుటోపీ పెట్టారు..
రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి సీఎం జగన్ కృషి..
కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి బుద్ధి చెప్పండి..
అనంతలో ఘనంగా సున్నా వడీ సంబరాలు..
‘‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. కోవిడ్ పరిస్థితులు తలెత్తినా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్నీ అమలు చేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. మూడేళ్లలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లక్షా 63 వేల కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశారు. మహిళల ఖాతాలోనే ఏకంగా 93 వేల కోట్లు వేశాం. గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేశారో లేదో చూడలేదు.. వచ్చే ఎన్నికల్లో ఓటు వస్తారా? అని ఆలోచించడంలేదు. ప్రజలు బాగుపడితే చాలన్నదే సీఎం జగన్ ధ్యేయం. ఇంత చేస్తుంటే రాష్ట్రం దివాళా తీస్తోందని చంద్రబాబు, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి’’ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నారని.. అనుకూల మీడియాలో విషప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ఆపాలన్న దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్ కళాభారతిలో సోమవారం సున్నా వడ్డీ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనంత, ఎంపీ తలారి రంగయ్య, మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మెప్మా పీడీ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజల సంక్షేమం కోసం చేసింది శూన్యమన్నారు. ఇప్పుడు అధికారం పోగానే జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటుంటే ఇక్కడి రాజకీయ పార్టీలు మాత్రం ప్రతీదీ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల బాగు కోసం ఆలోచించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని.. కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
*బాబు హయాంలో సంఘాలు నిర్వీర్యం*
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే అనంత అన్నారు.
వైఎస్‌ఆర్ హయాంలో మహిళా సంఘాలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే పావలా వడ్డీ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలను తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. 2014లో అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు కేవలం రూ.600 కోట్లు మాత్రమే సున్నా వడ్డీ అందించారన్నారు. 2019 ఎన్నికల్లోనూ మరోసారి మహిళలను మోసం చేసే కుట్రలు చంద్రబాబు చేశారన్నారు. ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ పేరుతో కేవలం రూ.10 వేలు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
*మహిళలకు అండగా వైఎస్ జగన్*
మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పాదయాత్రలో చూసి చలించిన జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఎన్నికల తేదీ వరకు ఉన్న అప్పులను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ‘వైఎస్‌ఆర్ ఆసరా’ పథకం తీసుకొచ్చి ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,759 కోట్లను అందించామన్నారు. ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3600 కోట్లు జమ చేశామన్నారు. ప్రస్తుతం అనంతరం నియోజకవర్గంలో రూ.6 కోట్లను సున్నా వడ్డీ కింద అందిస్తున్నట్లు చెప్పారు.
*మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి*
సృష్టికి మూలం స్త్రీ అని, కానీ తరతరాలుగా మహిళలు అణచివేతకు గురయ్యారని ఎమ్మెల్యే అనంత ఆవేదన వ్యక్తం చేశారు. వంటింటికే పరిమితం అవుతున్న మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధికి బాటలు వేసుకోవాలన్నారు. పిల్లలను బాగా చదివించుకోవాలని సూచించారు.
*ఎన్నడూ లేని విధంగా ‘అనంత’ అభివృద్ధి*
గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అనంత తెలిపారు. నియోజకవర్గంలో ఏకంగా 27 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లు చెప్పారు. నగరంలో ప్రధాన రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ మార్గ్ పనులు త్వరితగతిన చేపడుతున్నామని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపామని, ఐదారు నెలల్లో బయోమైనింగ్ పూర్తవుతుందని చెప్పారు. నగరంలో సుమారు 18 నుంచి 20 డివిజన్లలో మురికివాడలు ఉన్నాయని, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయన్నారు.
సచివాలయాలపైన సంఘాల భవనాలు
మహిళా సంఘాలు సమావేశాలు పెట్టుకునేందుకు భవనాలు కూడా కట్టిస్తామని ఎమ్మెల్యే అనంత స్పష్టం చేశారు. స్థలం ఉన్న చోట కొత్తవి కట్టిస్తామని, లేని ప్రాంతాల్లో సచివాలయాల పైన నిర్మాణాలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే నిధులను మహిళా సంఘాల అభ్యున్నతికి వెచ్చిస్తానని హామీ ఇచ్చారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
సున్నా వడ్డీ సంబరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే అనంత, ఎంపీ రంగయ్య, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు పాలాభిషేకం చేశారు. సున్నా వడ్డీ అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు 774 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.20 కోట్ల వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ మెగా చెక్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు.