thesakshi.com : ఇల్లేంటి.. రోడ్డుపై నడచివెళ్లడం ఏంటి మీకేమైనా మతి ఉండే మాట్లాడుతున్నారా? లేదా అని అనుకుంటున్నారా? నిజమే ఇల్లు నడిచి అలా వెళ్ళింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 139 ఏళ్ల నాటి ఈ ఇంటిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించారు.
ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించడానికి వందలాది మంది రోడ్డుకు ఇరువైపులా నిల్చున్నారు. 1880ల్లో నిర్మించిన ఈ ఇంటికి ఇంగ్లాండర్ హౌజ్ అని పేరు. ఇందులో ఆరు బెడ్ రూమ్ లు, మూడు బాత్ రూమ్ లు ఉన్నాయి. ఈ ఇంటిని ఓ హైడ్రాలిక్ ట్రాలీపై ఉంచి రిమోట్ కంట్రోల్ సాయంతో మెల్లగా మరో చోటుకి తరలించారు.
ఇంటిని తరలించడం అంటే సాధారణ విషయం కాదు కదా. అందుకే ఈ ప్రక్రియ చాలా మెల్లగా సాగింది. ఆ హైడ్రాలిక్ ట్రాలీ గంటకు కేవలం ఒక మైలు వేగంతో ముందుకు కదిలింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటిని తరలించే ప్రక్రియ నిజానికి 8 ఏళ్ల కిందటే ప్రారంభమైంది.
దీనిని తరలించడం కోసం చెట్లను కట్ చేశారు. పార్కింగ్ మీటర్లను తొలగించారు. ఎలక్ట్రిక్ లైన్లను తీసేశారు. మొత్తానికి ఫిబ్రవరి 21న, అంటే ఆదివారం ఈ ప్రక్రియను ముగించారు. ఇప్పటి వరకూ ఈ ఇల్లు ఉన్న ప్రదేశంలో కొత్తగా అపార్ట్‌మెంట్ నిర్మించనున్నారు. ఈ విలాసవంతమైన ఇంటిని మరో చోటికి మార్చేందుకు ఓనర్ కు అక్షరాలా 4 లక్షల డాలర్లు ఖర్చు అయింది.