thesakshi.com : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి పది మందికి తీవ్ర గాయాలైన రోడ్డు ప్రమాదం జరిగింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు మర్రిపాడు మండలం కండ్రిక వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్లారి నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండ్రిక వద్ద బోల్తా పడింది.
స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.