THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

ఒక తీర్పు..అనేక సందేహాలు..!

thesakshiadmin by thesakshiadmin
March 9, 2022
in Latest, Politics, Slider
0
ఒక తీర్పు..అనేక సందేహాలు..!
0
SHARES
70
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో హైకోర్టువారు ఇచ్చిన తీర్పు కొంతమందికి సంతోషం కలిగించింది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశించిన కోట్లాదిమందికి మాత్రం తీర్పు నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు. అదే సమయంలో ఆ తీర్పుపై చాలామందికి సందేహాలు వచ్చాయి. సామాన్య ప్రజానీకం కూడా ఈ తీర్పు పరిణామాలపై చర్చించుకుంటోంది. లేని చట్టాలపై కోర్టులు తీర్పులు ఇవ్వవచ్చా? అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయాలన్న నిర్ణయం గత ప్రభుత్వం చట్టం ద్వారా ఆమోదించినప్పుడు, ఈ ప్రభుత్వానికి ఆ అధికారం ఎలా లేకుండా పోతుంది? గత ప్రభుత్వం మూడు, నాలుగేళ్లలో చేయలేని పని ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో ఎలా చేస్తుంది? ఒక తీర్పుపై ఇన్ని సందేహాలు ఉత్పన్నం కాకుండా ఉంటే బాగుండేది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టువారు ఇచ్చిన తీర్పు ఒక రకంగా సంచలనంగానూ, మరో రకంగా వివాదాస్పదంగానూ కనిపిస్తుంది. గౌరవ న్యాయస్థానాన్ని గానీ, గౌరవ న్యాయమూర్తులను గానీ తక్కువ చేయజాలం. అదే సమ యంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై విశ్లేషించుకోవచ్చు. ప్రత్యే కించి రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకునేవారికి ఈ తీర్పు అమితానందం కలిగిస్తుంది. కానీ మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు గౌరవం, గుర్తింపు, అభివృద్ధి అవకాశాలు వస్తాయనీ ఆశించిన కోట్లాదిమందికి మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు.

గతంలో మన పెద్దలు, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య సమతుల్యత కోసం శ్రీబాగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దానికి చట్టపరమైన రక్షణ లేకపోవచ్చు. కానీ పెద్దతరహాలో ఆనాటి నేతలు రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలని నిర్ణయించి కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలక్రమంలో తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌కు రాజధాని, హైకోర్టు అన్నీ మారి పోయాయి. ఇప్పుడు మళ్లీ ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. అలాం టప్పుడు ప్రాంతీయ ఆకాంక్షలు సహజంగానే ముందుకు వస్తాయి. కానీ 2014లో ఎన్నికైన చంద్రబాబు ప్రభుత్వం వాటిని విస్మరించి అన్నిటినీ అమరావతి అనే పేరు పెట్టిన రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకృతం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ భూమి లేని చోట, రియల్‌ ఎస్టేట్‌ మోడల్‌లో పూలింగ్‌ పద్ధతి తెచ్చి మొత్తం అభివృద్ధి అంతటినీ ఒకే చోట కేంద్రీకరించ తలపెట్టింది. తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం అన్ని లక్షల కోట్ల వ్యయం ఒకే చోట పెట్టలేమని భావించి మూడు రాజధానుల విధానం తెచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులకు ప్రాధాన్యం ఇచ్చింది. అందుకోసం వివిధ కమిటీలతో అధ్యయనం చేయించింది. అప్పటి నుంచి దీనిని వివాదంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మార్చింది. హైకోర్టులో పలు వ్యాజ్యాలు కూడా వేయించారు. పరిస్థితులను సమీక్షించుకున్న ప్రభుత్వం సంబంధిత మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంది. రద్దయిన రాజ ధాని ప్రాంత చట్టాన్ని తిరిగి యధావిధిగా ఉంచుతూ నిర్ణయం తీసు కుంది. అయినా వ్యాజ్యాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పుపై పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఒకసారి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని ఆర్డినెన్సులు జారీ చేసిన తర్వాత హైకోర్టు ఆ వ్యాజ్యాలను కొనసాగించవచ్చా? అంటే లేని చట్టాలపై కోర్టులు తీర్పులు ఇవ్వవచ్చా? భవిష్యత్తులో జరిగే పరిణామాలపై కూడా కోర్టులు ఊహించి తమ ఆదేశాలను ఇవ్వవచ్చా? పంజాబ్‌ హైకోర్టులో ఒక మాజీ డీజీపీని నిర్దిష్ట తేదీ వరకూ అరెస్టు చేయరాదని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపడుతూ భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించి ఎలా తీర్పులు ఇస్తారని ప్రశ్నించినట్లు వార్త వచ్చింది. అదే సూత్రం ఈ కేసుకు వర్తించదా? కొంతకాలం క్రితం ఈ కేసు విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ చట్టాలు చేయకుండా ఆపజాలమనీ, రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో తాము నిర్దేశించజాలమనీ కూడా ధర్మాసనం పేర్కొంది. కానీ ఇప్పుడు తీర్పు అందుకు భిన్నంగా రావడం ఆశ్చర్యం కలిగించదా?

రాజధాని నిర్ణయాధికారం పార్లమెంటుకు ఉందని తీర్పులో చెప్పారు. అలాంటప్పుడు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కొనసాగాలి కదా? దానిని ఎందుకు ముందుగానే మార్చారన్న ప్రశ్నను హైకోర్టు వేసి ఉండాలి కదా? అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయాలన్న నిర్ణయం గత ప్రభుత్వం చట్టం ద్వారా ఆమో దించినప్పుడు, ఈ ప్రభుత్వానికి ఆ అధికారం ఎలా లేకుండా పోతుంది? రాజధాని ఎక్కడ ఉండాలన్న నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే నని కేంద్రం వేసిన అఫిడవిట్‌ను తీర్పులో విస్మరించారా? కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతిలో రాజధాని పెట్టవద్దనీ, మూడు పంటలు పండే భూములను చెడగొట్టవద్దనీ స్పష్టంగా చెప్పిన విషయాన్ని కోర్టువారు కూడా పట్టించుకోలేదా? రాజధాని నిర్మాణానికి అసలు 34 వేల ఎకరాల భూమి అవసరమా? ప్రభుత్వ భూమి ఉన్న చోట ఎందుకు పెట్టలేదు? భూములు ఇచ్చిన రైతులు నిజంగానే నష్టపోయారా? ఉపాధి కోల్పోయారా? మరో వైపు రైతులు చాలావరకు తమ భూములను విక్రయించుకున్నారన్నది అవాస్తవమా? కోట్ల రూపాయల ధరకు ఆ భూములు అమ్ముడు పోవడం అసత్యమా? అలాగే ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరాకు నలభై ఐదు వేల రూపాయల చొప్పున కౌలు చెల్లిస్తున్నా వారు త్యాగం చేసినట్లుగా కోర్టు ఎలా అభిప్రాయ పడుతుంది? వ్యాజ్యాలు వేసిన కొందరు టీవీల ముందు నిలబడి తాము కోర్టులలో వ్యాజ్యాలు వేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు. అలాంటివారు నిరుపేదలు అవుతారా? గత ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు అవసరం అవుతాయని బహిరంగంగానే చెప్పారు. కేంద్రం నుంచి లక్షాతొమ్మిదివేల కోట్లు మంజూరు చేయాలని లేఖ కూడా రాశారు. ఇంత భారీ వ్యయం రాష్ట్రం చేయలేదనే కదా దీని అర్థం! మరి అంత మొత్తం ప్రస్తుత ప్రభుత్వం ఎలా పెట్టగలుగుతుందని కోర్టువారు భావిస్తారు? కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి వివిధ స్కీములను అమలు చేస్తున్నారనీ, రాజధానికి ఎందుకు పెట్టరనీ కోర్టువారు అడగడం కరెక్టేనా?

రాజధాని ప్రాంతం అంతా కలిపి ఇరవై తొమ్మిది గ్రామాలలోనే ఉంది. ఇక్కడ ప్రభుత్వం లక్షల కోట్లు వ్యయం చేసి అభివృద్ధి చేస్తే కేవలం కొద్దివేల మందికే ప్రయోజనం కలుగుతుందన్నది వాస్తవం కాదా? దీనివల్ల ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య అసమానతలు మరింతగా పెరగవా? మరో వైపు ప్రభుత్వ స్కీముల ద్వారా రాజధాని ప్రాంతంతో సహా మొత్తం రాష్ట్రం అంతటా ప్రయోజనం కలగడం లేదా? పైగా కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆ పథకాలు పేదలకు ఉపయోగపడిన విషయాన్ని కోర్టువారు గుర్తించరా? అయినా ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే నైతిక అధికారం కోర్టులకు ఉంటుందా? మూడు నెలల్లో ప్లాట్లు వేసి, ఆరు నెలల్లో అభివృద్ధి చేయడం అన్నది మానవ సాధ్యమేనా? గత ప్రభుత్వం మూడు, నాలుగేళ్లలో చేయలేని పని ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో ఎలా చేస్తుంది? రాజధాని భూములను తాకట్టు పెట్టవద్దని హైకోర్టు చెప్పవచ్చా? ఆర్థిక కారణాలతో ప్రాజెక్టు ఆపరాదని ఆదేశించారు. అలాంటప్పుడు గత ప్రభుత్వం కోరిన విధంగా లక్ష కోట్ల రూపాయల మొత్తాన్ని వెంటనే కేంద్రం విడుదల చేయాలని ఎందుకు ఆదేశించలేదు? అసలు ఈ కేసులో ధర్మాసనం కూర్పుపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పిన ప్పుడు గౌరవ న్యాయమూర్తులు దానిని మన్నించకపోవడం ధర్మ మేనా? పైగా సంబంధిత అధికారిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయవచ్చా?

శాసనాలు చేసే అధికారం అసెంబ్లీలకు లేకపోతే మరి ఎవరికి ఉంటుంది? గతంలో సుప్రీంకోర్టు కావేరీ జలాలపై ఇచ్చిన తీర్పును తాము అమలు చేయజాలమని కర్ణాటక రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసినట్లు కొందరు గుర్తు చేస్తున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీలో హైకోర్టు, శాసన వ్యవస్థల పరిధులపై చర్చ జరుపుతామని అంటు న్నారు. ఏపీ అసెంబ్లీలో కూడా తీర్పును తిరస్కరిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంటుందా అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గత ముఖ్యమంత్రే అమరావతిపై పదివేల కోట్ల లోపు ఖర్చు అయి నట్లు చెబితే గౌరవ కోర్టువారు గత ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధికి పదిహేను వేల కోట్లు, మౌలిక వసతుల కల్పనకు 32 వేల కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. అంత మొత్తాలు వ్యయం చేసి ఉంటే, ఈపాటికి రాజధానిలో చాలా భాగం అభివృద్ధి చెంది ఉండాలి కదా? దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ ప్రకారం మొత్తం వ్యయం చేసింది రూ. 8,572 కోట్లే. అందులో మూడువేల కోట్ల వరకు తెచ్చిన అప్పులపై కట్టిన వడ్డీలుగా ఉంది.

రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడరాదని అను కుంటే, మరి గత ప్రభుత్వం ఇప్పటికే కొన్నిటికి భూముల్ని విక్రయిం చింది. అది అభ్యంతరకరం కాదా? ప్రస్తుత ప్రభుత్వం ప్లాట్లు అభి వృద్ధి చేసి ఇస్తామనే చెబుతోంది కదా? విశేషం ఏమిటంటే, ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి కొన్ని వేలమంది ప్లాట్లను క్లయిమ్‌ చేయడం లేదట. అంటే ఎవరో బినామీల పేర ఈ భూములు ఉన్నా యని అనుకోవాలా? కోర్టువారి దృష్టికి ఇలాంటి విషయాలు ఏవీ వెళ్లి ఉండకపోవచ్చు. గత ప్రభుత్వ హామీలు నెరవేర్చాల్సిందేనని కోర్టు వారు అభిప్రాయపడ్డారు. వినడానికి బాగానే ఉన్నా, అది ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తుంది. గత ప్రభుత్వం లక్ష కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దానిని నమ్మి రైతులు టీడీపీకి ఓట్లు వేయడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీని కొద్దిమేర అమలు చేసి తర్వాత చేతులెత్తేసింది. అలాంటి హామీ లను ఆ తర్వాతి ప్రభుత్వం కొనసాగించాలని ఆశించగలమా?

గౌరవ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులన్నిటిపైనా రకరకాల అభిప్రాయాలు రావచ్చు. కానీ ఒక తీర్పుపై ఇన్ని సందేహాలు ఉత్పన్నం కాకుండా ఉంటే బాగుండేది. ఈ మొత్తం వ్యవహారం రాజధాని ప్రాంతంలోని రైతులు లేదా భూమి సొంతదారులకూ ప్రభుత్వానికీ మధ్య ఉండవలసిన వివాదం. ఇప్పుడు హైకోర్టుకూ, ప్రభుత్వానికీ మధ్య అన్నట్లుగా పరిస్థితి మారిందా అన్న ప్రశ్న కూడా వస్తుందని అనుకోవచ్చా? 2019లో జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందువల్లో హైకోర్టులో అనేక కేసులలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరం. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామా రావు కూడా కొన్ని సందర్భాలలో ఇలాంటి సమస్యనే ఎదుర్కుంటే, ఆయన చివరికి తనకు ప్రజాన్యాయస్థానమే ముఖ్యమని వ్యాఖ్యా నించారు. ఇప్పుడు జగన్‌కు అదే పరిస్థితి ఎదురవుతోందా? కోర్టులు ఒకవైపూ, సామాన్య ప్రజలు మరోవైపూ ఉన్నారన్న అభిప్రాయం కలగడం, సమాజానికీ, న్యాయవ్యవస్థకూ మంచిది కాదని చెప్పాలి.

✍️కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Tags: #Andhrapradesh#apgovernment#aphighcourt#apnews#apstatecaptials#komminenisrinivasrao#threecaptials
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info