thesakshi.com : పెళ్లికి రెండ్రోజుల ముందు ఓ వాలంటీర్ తీవ్ర జ్వరంతో మృతి చెందిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెదకూరపాడు మండలం లింగంగుంట్లకు చెందిన రావెల శివయ్య, వెంకాయమ్మ దంపతుల కుమారుడు నాగ చైతన్య గ్రామ వాలంటీర్. ఇతనికి నరసరావుపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా 13వ తేదీన జ్వరం రావడంతో అస్వస్థతకు గురై నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు.
అయితే పెళ్లికి ఒకరోజు ముందు జ్వరం, వాంతులు కావడంతో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డెంగ్యూతో పాటు జాండిస్ లక్షణాలు ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.
చైతన్య తండ్రి శివయ్య కూడా పది రోజులుగా డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెళ్లికి నాలుగు రోజుల ముందు డిశ్చార్జి కావడంతో ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగ చైతన్య తల్లి వెంకాయమ్మ అంగవైకల్యంతో బాధపడుతున్నారు. నాగ చైతన్య మృతి పట్ల ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.