thesakshi.com : ప్రతి వ్యక్తికీ ఒక పర్సనాలిటీ ( మూర్తిమత్వం ) ఉంటుంది. ఆలోచించే తీరు , స్పందించే తీరు , ప్రవర్తన…. ఇవన్నీ అన్నమాట. ప్రపంచం లో ఏ ఇద్దరి పర్సనాలిటీ లు ఒకే తీరుగా వుండవు. అదే సమయం లో కొన్ని పర్సనాలిటీ లు దగ్గరగా ఉంటాయి. కొన్ని పరస్పర విరుద్ధంగా ఉంటాయి.
ఒక వ్యక్తి తన జీవిత కాలం లో ఎక్కువ సేపు గడిపేది తన లైఫ్ పార్టనర్ ( జీవిత సహవర్తి ) తోనే. భార్య భర్త ల పర్సనాలిటీ లు పొందిక గా ఉంటే ఆ కాపురం చల్లగా ఉంటుంది. అలాంటి కుటుంబం లో భార్య , భర్త లు హ్యాపీ. తమ వృత్తి పై దృష్టి సారించే అవకాశం దక్కుతుంది. అమ్మ నాన్న హ్యాపీ గా ఉంటే పిల్లలూ హ్యాపీ. పండంటి కాపురం. దేశం అంటే అనేక కుటుంబాల కూటమి. దేశం ప్రగతి సాధిస్తుంది.
ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలి అంటే ప్రధానంగా చూడాల్సింది వారి పర్సనాలిటీ లు పొందికగా ఉన్నాయా? లేవా? అని . పొందిక అయిన పర్సనాలిటీ కలిగి ఉండడం , అవతలి వారి స్థానం లో తనను ఉంచుకొని వారి ని అర్థం చేసుకోవడం { దీన్నే ఎంపతీ లేదా సహానుభూతి అంటారు } చాలా అవసరం . ఇవి లేక పొతే పెళ్లి పెటాకులు అవుతుంది . మనఃశాంతి, ఆరోగ్యం, కెరీర్ అన్నీ అవుట్
పెద్దలు కుదిర్చే వివాహాలలో పర్సనాలిటీ కంపాటబిలిటీ అనే కోణం లో చూడడం తక్కువ . ఆస్తులు- అంతస్తులు ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కనిపిస్తుంది .ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలు , పెళ్లి చూపులు , పెళ్లిలా పేరయ్యలు అన్నీ endangered species జాబితా లోకి వెళ్లి పోతున్నాయి . కొనేళ్లకు విలుప్తం అయిపోతాయి
ఒకప్పుడు ముక్కుపచ్చలారని వయసులోనే పెళ్లి చేసేవారు . ఇందులో అనేక సమస్యలు .. అందుకే వాటిని 19 శతాబ్దం లోనే నిషేదించారు.
ఇలా చెబుతున్నాను అంటే బాల్య వివాహాలను సమర్దిస్తున్నటు కాదు . చిన్నప్పుడు, అంటే ఇంకా పర్సనాలిటీ లు సరిగా ఏర్పడక ముందే ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు అయితే వారు ఒకే చోట నివసించడం , పెద్దల పర్యవేక్షణ లో పెరగడం మొదలు పెడితే ఒకరి పర్సనాలిటీ మరొకరికి పొందికగా రూపొందే అవకాశం ఉండేది . ఇప్పుడు వివాహ సగటు వయస్సు 25 . అప్పటికి అమ్మాయికి అబ్బాయికి ఒక క్లియర్ కట్ పర్సనాలిటీ ఏర్పడుతుంది . ఇద్దరి మనస్తత్వాలు పొందిక గా ఉన్నాయా ? లేవా? అని విషయం చూడక పెద్దలు వివాహం జరిపిస్తే అలాంటి కాపురాలు నిలబెడుతాయా? లేవా? అనేది ఛాన్స్ ఫాక్టర్ పై ఆధార పడుతుంది . బై ఛాన్స్ ఇద్దరి పర్సనాలిటీ లు దగ్గర గా ఉండడం , లేదా ఒకరికి లేదా ఇద్దరికీ ఎంపతీ , సర్దుకొని పోయే మనస్తత్వం ఉండడం జరిగితే ఆ కాపురం నిలబడుతుంది . అలా కాకపోతే పెళ్లి వీడియో చేతికి అందే నాటికే కీచులాటలు .. అటు పై కోర్ట్ మెట్లు .. బ్రేక్ అప్ … అదో టార్చర్ .. హారర్ సినిమా .
మరి ప్రేమ వివాహాలు గొప్పవా ? ప్రేమ జిందాబాద్ అనాల్సిందేనా ?
ప్రేమ వివాహాలకూ పై సూత్రం వర్తిస్తుంది . ఇద్దరి పర్సనాలిటీ లు మ్యాచ్ అవుతాయా? లెవా ?అనేది కీలకం . ఒక వ్యక్తి మూర్తిమత్వం ఒక షేప్ కు రావాలంటే , ఒక స్థాయి పరిణతి సాధించాలంటే ఆ వ్యక్తికి కనీసం ఇరవై ఏళ్ళు రావాలి. ఇంతకంటే చిన్న వయసు వారి పర్సనాలిటీ అప్పుడే గీస్తున్న బొమ్మ లాంటిది . బొమ్మ సగం లో వున్నప్పుడే అదేంటో చెప్పలేము కదా ? అలాగే ఒక వ్యక్తి మూర్తిమత్వం ఇంకా ఒక తీరు లోకి రాకముందే తన గురించి తనకే అవగాహన ఉండదు . అలాంటప్పుడు తనకు ఎలాంటి భార్య / భర్త కావాలో నిర్ణయించుకునే అవకాశం ఎక్కడ ?
అబ్బాయి మహేష్ బాబు లా ఉన్నాడా ? కర్లీ హెయిర్ ఉందా ? పొడవుగా స్లిమ్ గా వున్నాడా? బైక్ ఉందా ? అని అమ్మాయిలు ….. పాపం ఈ రోజు అబ్బాయిలకు అంత choice లేదు . అమ్మాయి దొరికితే చాలు . ఆ అమ్మాయి అందంగా ఉంటే జాక్ పాట్ కొట్టినట్టే .
టీనేజ్ ప్రేమలను వ్యామోహం అంటారు . పెళ్ళయాక సిక్స్ ప్యాక్ పోయి ఫామిలీ ప్యాక్ వస్తే ? భార్య గర్భం ధరించి ఒక బిడ్డను కనేటప్పటికీ ఆమె శరీరం లో ఎన్నో మార్పులు . అందుకే పెద్దలు అన్నారు .. అందాన్ని కొరుక్కుని తింటామా అని . అందం అనేది అసలు పాయింటే కాదు అనడం లేదు కాని అసలు పాయింట్ పర్సనాలిటీ మ్యాచ్ కావడం .
మనం ఉన్నది కమర్షియల్ యుగం లో .. అన్నీ వ్యాపార వస్తువులే . మరి ప్రేమ ను ఎలా వదిలేస్తారు ?
అదే ప్రేమికుల దినం .. వాలెంటైన్ డే .
మన దేశం జనాభా ఏజ్ పరంగా చూస్తే పిరమిడ్ ఆకారం లో వుంది . 75 శాతం జనాభా 35 లోపు వారే . అంటే ప్రేమించే వయసు లో ఉన్నవారు కొన్ని కోట్ల మంది . ప్రేమ పేరుతొ ఈ ఒక్క రోజే కొన్ని వందల కోట్ల బిజినెస్ సాగుతుంది . ఒక్క రోజు తో ఆగిపోదు .. కొనసాగింపు ఉంటుంది . ఏ బిజినెస్ కైనా స్లంప్ .. అప్ డౌన్ .. season ఉంటుంది . ప్రేమ బిజినెస్ మాత్రం… 365 రోజులు .. లాక్ డౌన్ ఉండదు . ఆ మాటకు వస్తే లాక్ డౌన్ లో ఇంకా ఎక్కువ నడుస్తుంది .
ఈ రోజు ఓయో హోటల్స్ కు ఒక్క సారి వెళ్ళండి . గంటకో రెండు గంటలకో రూమ్ బుక్ చేసుకొని వచ్చి పోతున్న జంటలతో హోటల్ కిక్కిరిసి కనిపిస్తుంది . పెద్దగా రష్ లేని సినిమా హాల్ లో ఒక మూల కూర్చొన్న జంటలు , పబ్లిక్ పార్కుల్లో కదలాడుతున్న పొదలు , ఎక్కడో నిర్మానుష్య ప్రదేశం లో పార్క్ చేసిన కార్ లు ..
అనేక రకాల ప్రేమ సినిమా లు .. దేని బడ్జెట్ దానిది . కొత్త దుస్తులు , కేక్ లు , గ్రీటింగ్ కార్డు లు కండోమ్ లు .. పిల్స్, అబార్షన్స్ , కోర్ట్ లు .. పోలీస్ స్టేషన్ లు .. లాయర్ లు .. అబ్బో లిస్ట్ కొండవీటి చాంతాడంత . .
నేటి యువత ఆలోచించే తీరు ఇలా వుంది .. ” పెళ్లిళ్లు రెండు రకాలు . ఒకటి ప్రేమ్ పెళ్లి . అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ను నువ్వు పెళ్లి చేసుకోవడం .. లేదా పెద్దలు కుదురిచ్చిన పెళ్లి . అంటే ఎవడిదో ex గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవడం ” . అర్థం అయ్యిందా ? కాకపోతే మళ్ళీ చదవండి .
కాలేజీ లో అడుగుపెట్టేటప్పటికీ బాయ్? గర్ల్ ఫ్రెండ్ లేదంటే నామోషీ .. చేతకాని తనం . ఇదో ప్రవాహం . నలుగురి తో నారాయణ . అమ్మాయిల కు ఛాయస్ ఎక్కువ . పాపం అబ్బాయిలు . నాకొక ” గర్ల్ ఫ్రెండ్ కావాలి… ” అంటూ చకోర పక్షుల్లా చూసే వారు కోకొల్లలు .
ఏ వయసు లో చెయ్యాల్సిన పని ఆ వయసు లో చెయ్యాలి . క్లాస్ లో కూర్చొని ” ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్ట్లుంది “.. “నువ్వే… నువ్వే… నాలోనే నువ్వే” అని గమ్మత్తు లోకం లో విహరిస్తుంటే చదువెక్కడ ? పునాది బలహీనంగా ఉంటే అటుపై జీవితం అనే మేడ ఎంత దృఢం ? ప్రేమించిన అమ్మాయి తో ఎక్కడో భోపాల్ కు పారిపోయి రెండు ఆవులు కొనుక్కొని హ్యాపీ గా జీవితం గడపడానికి ఇదేమీ తేజ సినిమా కాదు కదా ?
సంజీవయ్య పార్క్ లో మొదలైన టీనేజ్ ప్రేమ లు అటుపై నాంపల్లి విడాకుల కోర్ట్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువ .
ప్రేమ! ఒక స్వీట్ ఫీలింగ్ . ఆక్సీటోసిన్ హార్మోన్ .. నా సామీ రంగా .. లైలా- మజ్ను .. పార్వతి- దేవదాసు .. పుష్ప – శ్రీవల్లి . కాలం మారొచ్చు . అదే హార్మోన్ . అదే కిక్కు . నా సామీ .. రారా సామీ .. ఆక్సిటోసిన్ సామీ .. లవ్ హార్మోన్ సామీ ..
ఆక్సిటోసిన్ హై ఉన్నంత వరకు ఫుల్ హ్యాప్పీస్ . అది ఎంత కాలం నిలుస్తుంది? అనేది కీలకం . పర్సనాలిటీ లు మ్యాచ్ కాక పొతే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని , సర్దుకొని పోయే స్వభావం లేకపోతె కొంప కొలంబియా అవుతుంది . లవ్ స్థానం లో స్ట్రెస్ . ఆక్సిటోసిన్ పోయి కార్టిసోల్ వస్తుంది . .. ఒళ్ళు- ఇల్లు, చదువు- కెరీర్ అన్నీ సర్వనాశనం .
ప్రేమ ఇచ్చే కిక్కు కన్నా బ్రేక్ అప్ షాక్ వెయ్యి రెట్లు అధికం . బ్రేక్ అప్ పీస్ ఫుల్ గా ఉండాలంటే దానికీ మానసిక పరిణతి కావాలి కదా ?నన్ను వదిలి వాడితో తిరుగుతోంది అని ఆసిడ్ దాడులు .. పాత వీడియో లు ఫోటో ల లీక్ .. అదో క్రైమ్ ప్రపంచం … చివరకు చెంచల్ గూడా జైలు .
వాలెంటైన్ డే బిజినెస్ ఎంత బ్రిస్కో .. విడాకుల లాయర్ ల ఆదాయం కూడా అంతే స్థాయి . ఇదీ నేటి వాస్తవం . ఇది కాకుండా అబార్షన్ లు .. ఆత్మహత్యలు .. అఘాయిత్యాలు .. వెయ్యి సినిమా లు తీసినా తరగని కంటెంట్ . ఎన్నో కోణాలు .
పన్నెండేళ్ళకే వయసు వస్తోంది . పెళ్లయేది ఇరవై అయిదు దాటాక . అంటే కనీసం పదమూడు సంవత్సరాలు . జీవితం లో ఇది కీలక దశ . ఐఐటీ నా ఐటిఐ నా ? ఎయిర్ బస్సా ఎర్ర బస్సా? సిలికాన్ వాలీ నా గల్ఫ్ ఎడరా? .. నీ జీవితం ఏ దిక్కున పయనిస్తుంది ? ఎలా ఉండబోతుంది డిసైడ్ అయ్యేది సరిగ్గా ఈ వయసులోనే .
ఒకప్పుడైతే మంచో చెడో కులవృత్తులు .. .. వ్యవసాయం, చేతి వృత్తులు .. ఇప్పుడు పరిస్థితి వేరు ..
తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ .. కొడుకు చిన్న ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగి . తన బాల్యం లో నాన్న కలెక్టర్ గా వున్నప్పుడు తన బంగ్లా ప్యూన్ కు ఉన్న లైఫ్ స్థాయి కూడా తనకు ఇప్పుడు లేదు . అమెరికా లో పిల్లాపాపలతో స్థిరపడన ex గర్ల్ ఫ్రెండ్ గుర్తుకు వచ్చినప్పుడల్లా కసి . తనవల్ల తన లైఫ్ నాశనం అయిపోయింది అనే ఫీలింగ్ . దాని కేంటి లైఫ్ లో హ్యాపీ గా స్థిరపడి పోయింది చిన్న సైజు ఏనుగు లా వుంది .. ఫేస్బుక్ లో ఫొటోస్ చూస్తుంటే ఛీ… దీని కోసమా నేను క్యాంపస్ లో రేయి పగలు సైట్ కొడుతూ తిరిగింది? అనిపిస్తుంది . ప్రపోసల్ .. లవ్ .. పబ్బులు.. డిస్కో లు .. బ్రేక్ అప్ .. దాన్ని అధిగమిచడానికి ఫుల్ బాటిల్ .. డ్రగ్స్ ..ఇది తన నాలుగేళ్ళ క్యాంపస్ లైఫ్ .. జీవితం సర్వనాశనం . కారు డోర్ తీసి డ్రైవర్ నిలబడే వాడు తన చిన్నప్పుడు .. ఇప్పుడేమో షేర్ ఆటో కోసం వెయిటింగ్ .. అన్నిటికీ అమెరికా లో ఉన్న ఆ గున్నఏనుగే కారణం అనుకొంటాడు . తప్పు తనది అని అతనకి అర్థం కావడానికి ఇంకో లైఫ్ రావాల్సిందే .
తప్పు ప్రేమది కాదు . ఏ వయసులో ఏమి చెయ్యాలి ? ఎలా బాలన్స్ చెయ్యాలి ? అని తెలియక పోవడమే .
జీవితం అనే సినిమా చాలా చిన్నది . ఇంటర్వెల్ కూడా ఉండదు . మొదటి ముప్పై నిముషాలు బాగుంటుంది . అది అమ్మ నాన్న స్పాన్సర్ చేసింది . అసలు సినిమా మొదలయ్యేది అప్పుడే . మీ సినిమా హిట్టా ఫట్టా తేలేది అక్కడే .
పెద్దలు కుదురిచ్చిన పెళ్లిళ్లు అన్నీ గొప్పవి కావు . ప్రేమ వివాహాలు అన్నీ తప్పు కాదు .
పర్సనాలిటీ .. ఎంపతీ .. ఏ సమయం లో ఏమి చెయ్యాలి? అని బాలన్స్ చేసుకొనే పరిణతి . ఇవీ కావాల్సింది . దీని గురించి ఏ పుస్తకం చెప్పదు. స్కూల్ లోనో కాలేజీ లోనో పాఠాలు వుండవు .మంచి మాటలు .. సరైన పాఠాలు బంగారామాయనే ..
తనను ఎదిరించి పెళ్లి చేసుకొన్న కూతురి భర్త ను చంపడం సరైన చర్యా? కాదా ? వాలెంటైన్ డే రోజు పార్క్ లో ప్రేమికుల పై దాడులు సరైన కావా ? సోషల్ మీడియా కు టీవీ చానెల్స్ కు అంతులేని కంటెంట్ .
ఏనుగు ఏడుగురు అంధులు కథ .. అంతులేని వింతకథ . చూస్తూనే వుంటారు ..