thesakshi.com : ఒక్కసారిగా కోనసీమ అట్టుడికింది. జిల్లాకు భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో అమలాపురంలో హై టెన్షన్ నెలకొంది. అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని కోరారు.
భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పాలక వర్గం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పాలనపర లోపాలను కప్పి పుచ్చుకోవడానికి.. లేని సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి కారణం ఎవరనేది రాష్ట్రంలో గల ప్రజలందరికీ తెలుసునని అన్నారు. బాధ్యత గల పదవీలో ఉన్న హోం మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండించారు.
అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకించడం బాధాకరం అని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేయడంతో మార్చామని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారని వివరించారు. వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తప్పమని హెచ్చరించారు.