thesakshi.com : ఏపీ రాజకీయాల్లో పార్టీల అధినేతలు ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలోనూ, వాటిని అమలు చేయడం లోనూ, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనూ వారు అనుసరించే వ్యూహాలే వారికి గెలుపోటములు అందిస్తుంటాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు సైతం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అనామకంగా కనిపిస్తున్నారంటే అది ఆయన స్వయంకృతమే కాదు, ప్రత్యర్ధి వైఎస్ జగన్ ఎత్తుల్ని అర్ధం చేసుకోలేకపోవడమే. మరి అలాంటి ఎత్తుగడలకు పేరొందిన జగన్ కూడా తన సహజశైలికి భిన్నంగా వెళ్తుండటం తొలిసారి కనిపిస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఏపీ రాజకీయాల్లో కాలుమోపిన జగన్ ఆరంభం నుంచీ తనదైన శైలిలో గోప్యత ప్రదర్శిస్తూ వచ్చారు. తీసుకునే నిర్ణయాల్లోనూ అదే గోప్యత పాటిస్తారు. వాటిని అమలు చేయడంలోనూ అదే విధమైన గోప్యత పాటిస్తారు. ఎత్తులకు పై ఎత్తులు వేసేటప్పుడు కూడా అదే గోప్యతతో ప్రత్యర్ధులకు ఊహకు కూడా అందరు. ఈ గోప్యతా స్వభావం వైఎస్ జగన్ కు ఇప్పటివరకూ ఎన్నిసార్లు పనికొచ్చిందో తెలియదు కానీ ఈసారి కేబినెట్ విస్తరణ సందర్భంగా మాత్రం ఆయన తన పాత స్వభావానికి విరుద్ధంగా కనిపిస్తున్నారు.
గతంలో జగన్ తొలిసారి సీఎం పదవి చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పుడు అందులో పదవులు దక్కించుకునే వారిపై కానీ, ఐదుగురు డిప్యూటీ సీఎంలపై కానీ ఎవ్వరికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆయన కేబినెట్ విస్తరణలో మాత్రం జగన్ అంతా ఓపెన్ గా కనిపిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీ ప్రకారం చేపడుతున్న ఈ ప్రక్షాళనలో ఆది నుంచీ జగన్ అంతా పారదర్శకమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేబినెట్ లోనే మంత్రులకు ఉద్వాసన గురించి చెప్పేయడంతో మొదలుపెడితే, ఇవాళ రోజూ వస్తున్న లీకుల్ని గమనిస్తే ఇదంతా జగన్ శైలికి భిన్నంగా కనిపించక మానదు.
వాస్తవానికి జగన్ శైలిని గమనిస్తే పూర్తిస్ధాయిలో గోప్యత కనిపిస్తుంది. ఆయనతో మాట్లాడిన వారు సైతం ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వారికే ఎన్నోసార్లు షాకులిచ్చిన జగన్.. తాజాగా కేబినెట్ ప్రక్షాళన సందర్భంగా కూడా అలాగే వ్యవహరిస్తారని అంతా భావించారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల విషయంలోనూ చివరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచి జాబితా విడుదల చేసిన జగన్.. అందులో పాటించిన సమీకరణాలు చూస్తే ప్రత్యర్ధులు అవాక్కయ్యారు. కానీ ఇప్పుడు జగన్ తన సొంత శైలికి భిన్నంగా కేబినెట్ ప్రక్షాళనలో మాత్రం అంతా ఓపెన్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది.
జగన్ ఇలా తన సహజశైలికి భిన్నంగా మంత్రివర్గ విస్తరణపై అంతా ఓపెన్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటం వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అది ఆయన ఉద్వాసన పలికే కేబినెట్ మంత్రుల్లో అసంతృప్తి. ఎందుకంటే రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్లో 90 శాతం వరకూ తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తామని జగన్ ముందే చెప్పేశారు.
అయితే ఈ మూడేళ్లలో కరోనాలోనే రెండేళ్లు కొట్టుకుపోయాయి. దీంతో వారికి మిగిలింది పదవులు చేపట్టగానే ముందు ఆరునెలలు, జగన్ ఇచ్చిన ఆరునెలల పొడిగింపు. ఈ ఏడాది కాలమే వారికి దక్కింది. దీంతో చాలా మంది మంత్రుల్లో ఆ అసంతృప్తి కనిపిస్తోంది. అంతే కాదు కేబినెట్లో మధ్యలో వచ్చి చేరిన అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ వంటి మంత్రులైతే రెండేళ్లు కూడా పూర్తిగా పనిచేయలేదు.
దీంతో వారిలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఈ అసంతృప్తిని కొంతమేరకైనా చల్లార్చేందుకు జగన్ కేబినెట్ ప్రక్షాళనపై ముందే సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పుడు అమల్లోనూ అదే చూపిస్తున్నారు. అంతే కాదు పాత మంత్రులకు ప్రత్యామ్నాయ పదవులను కూడా చూపించేస్తున్నారు. అయితే దీని వల్ల ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందనేది కాలమే సమాధానం చెప్పాలి.