thesakshi.com : వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం కొన్ని నెలలుగా పులివెందుల, కడపల్లోనే మకాం వేసిన అధికారులను బెదిరింపులకు గురిచేయడం, ప్రలోభాలకు గురిచేయడంలాంటివి జరిగాయి. కేసు దర్యాప్తు ఎంత కాలం పడుతుందని కోర్టు కూడా నిలదీసింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేసును త్వరితగతిన ముగించేయాలనుకుంటున్న అధికారులు అందుకు తగ్గ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. కాస్తంత ఆలస్యమైనా పర్వాలేదు సాక్ష్యాధారాలను గట్టిగా సేకరించాలనే పట్టుదలతో సీబీఐ ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం కడప జిల్లా జైల్లో ఉంటున్న నిందితుల బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగింది.
ఈ సందర్భంగా నిందితుల (దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వై. సునీల్ యాదవ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి) కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులకు తీవ్ర ముప్పు ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాది తో పాటు వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది కూడా వాదించారు.
నిందితులకు బెయిల్ ఇవ్వొద్దన్న అంశంపై సీబీఐ వివేకా కుమార్తె తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనల్ని చూస్తే..
వివేకా హత్య వెనుక భారీ కుట్ర కోణం ఉంది. దాన్ని తేల్చే కీలక దిశగా దర్యాప్తు సాగుతుంది. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది.
పిటిషనర్ సాక్ష్యులను బెదిరిస్తున్నారు.బెయిల్ ఇస్తే వారికి తీవ్ర ముప్పు ఉంది.
సీబీఐ అధికారుల డ్రైవర్ ను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు. హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డిపై హత్య.. హత్యాయత్నం.. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే అంశంపైనా ఇతర సెక్షన్లు కలిపి మొత్తం 31 కేసులు ఉన్నాయి.
శివశంకర్రెడ్డి జైల్లో ఉంటూనే సాక్ష్యులను బెదిరిస్తున్నారు. సీబీఐని దర్యాప్తు చేయనీయటం లేదు. గతంలో సీబీఐ ముందు సాక్ష్యం ఇవ్వటానికి అంగీకరించిన వారు.. ఇప్పుడు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వటానికి నిరాకరించారు.
పోలీసులు సీబీఐకు సహకరించటం లేదు. దర్యాప్తు పూర్తి అయి.. హత్య వెనుక కుట్రదారులు ఎవరో తేలే వరకు పిటిషనర్లకు బెయిల్ ఇవ్వొద్దు అని సిబిఐ వాదనలు చేసింది.