thesakshi.com : పెనుమూరులో ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లా మధు సరియా గ్రామానికి చెందిన రాజ్ దూత్ అనే వ్యక్తి పక్కింటి 20 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చడంతో ఎక్కడికో తీసుకెళ్లాలని ప్రియుడిని ఒత్తిడి చేయడంతో చెన్నైలో పనిచేస్తున్న రాజ్‌దూత్ ఆమెను చిత్తూరుకు తీసుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్ 11న చిత్తూరులోని ఓ సెల్‌ఫోన్ షాపులో ఫోన్ రిపేర్ చేసి, అనంతరం మృతురాలు కవిత కుమారిని పెనుమూరు క్రాస్ రోడ్డు సమీపంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో బి-ఫార్మసీ కోర్సులో చేర్పించేందుకు ప్రయత్నించాడు.
అయితే సీటు రాకపోవడంతో మండలంలోని విజయనగరం, కలవగుంట పంచాయతీలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అబార్షన్ చేయించుకోవాలని ప్రియురాలిపై ఒత్తిడి తెచ్చాడు. బాధితురాలు నిరాకరించడంతో, ఆమెను అంతం చేయాలని ప్లాన్ చేసి, ఆమె నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండుతో గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత ఆమె దుస్తులతో సహా ఎలాంటి ఆధారాలు లేకుండా పారిపోయాడు.
రెండు రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు అక్టోబర్ 19న పోలీసులకు సమాచారం అందించడంతో పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ నరేంద్ర అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడు తన మొబైల్ రిపేర్ చేసిన మొబైల్ షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్ట్ చేశారు.