thesakshi.com : తమకు పదే పదే అనేక విషయాల్లో అడ్డుతగులుతున్నాడనే కారణంగా ఇటీవల పెద్దపల్లి జిల్లాలో పలువురు యువకులు న్యాయవాది దంపతులను అతికిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై అనేక చోట్ల నిరసన వ్యక్తం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అంశం ఇలా ఉంటే.. తెలంగాణలో మరో న్యాయవాదిపై హత్యాయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ భూవివాదంతో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన పలువురు.. ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.
గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల ఆయన వాదిస్తున్న వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని వారంతా రగిలిపోయారు.
కొద్దిరోజుల క్రితం న్యాయవాదిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆయనపై తుపాకీ గురిపెట్టడంతో పాటు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు… వారిని అదుపులోకి తీసుకున్నారు.