thesakshi.com : కర్నూలులో పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం, రైతులకు ఆర్థిక సాయం..కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కౌలు రైతుల ఆందోళన యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గం శ్రీవల్లె గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరారు.
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న నలుగురు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరపున రూ.లక్ష సాయం చేశారు.
అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు చింతా సురేష్, రేఖగౌడ్, హసీనాబేగం, అర్షద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, అనంతపురం జిల్లా నాయకులు పెండ్యాల హరి తదితరులు స్వాగతం పలికారు. ఓర్వకల్ విమానాశ్రయం నుంచి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీతో శిరివెల్లుకు చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. వివిధ జిల్లాలో పర్యటిస్తూ.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కదం తొక్కారు. ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న పలు రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి సాయం అందించారు.