thesakshi.com : ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదిన్నరేళ్లుగా ముఖ్యమంత్రి.. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఐదేళ్ల పాటు సీఎంగా పని చేశారు చంద్రబాబు. మొత్తంగా 14 ఏళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన ఆయనకు.. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలు పెద్ద పరీక్షనే పెట్టాయి. అంచనాలకు తగ్గట్లే.. బాబుకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు సొంత నియోజకవర్గ వాసులు. అతి తక్కువ పంచాయితీల్ని విపక్ష టీడీపీకి కట్టబెట్టిన అక్కడి ప్రజలు.. అధికార వైసీపీ వెంటే తామున్న విషయాన్ని స్పష్టం చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో వందశాతం పంచాయితీల్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.అదే సమయంలో బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయితీలు ఉన్నాయి. అందులో 89 పంచాయితీలకు మూడో విడత ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయితీల్లో అధికార పార్టీకి చెందిన మద్దతుదారులే విజయం సాధించారు.
టీడీపీ మద్దతుదారులు కేవలం 14 పంచాయితీ ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గాన్ని తిరుగులేని రీతిలో మార్చానని డబ్బా కొట్టే చంద్రబాబుకు సొంత ప్రజలు భారీగా షాకిచ్చారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు వ్యవహరించిన చంద్రబాబుకు.. తాజాగా కుప్పంలో కేవలం 14పంచాయితీల్లో మాత్రమే సొంతం కావటం చూస్తే.. ఏపీ పంచాయితీ ఎన్నికల్లో బాబుకు తగిలిన అతి పెద్ద గాయం ఇదేనని చెప్పాలి. అంతేకాదు..ఇంతకు మించిన చెత్త రికార్డు ఆయనకు మరేదీ లేదన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. ఎలాంటి బాబు ఎలా అయిపోయారు. కాలమహిమ అంటే ఇదేనేమో!