thesakshi.com : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతోపాటు.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన బంజారాహి ల్స్ రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్లో డ్రగ్స్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ డ్రగ్స్ వినియోగం ఇప్పుడు కొత్త కాదని.. ఎప్పటి నుంచో జరుగుతున్నదేనని.. ఇది స్థానిక పోలీసులకు కూడా తెలుసునని.. పోలీసు పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో ఇప్పుడు.. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏకంగా.. ముగ్గురు కీలక పోలీసు అధికారులకు ఇక్కడ ఏం జరుగుతోందో.. ఆది నుంచి పూస గుచ్చినట్టు తెలుసునని పెద్దలకు ఉప్పందింది.
అంతేకాదు.. వీరు ఎందుకు సహకరిస్తున్నారు.. అనే విషయాన్ని కూడా కూపీ లాగారు. ఈ ముగ్గురు పోలీసు అధికారులకు ప్రతినెలా పబ్ నుంచి లంచం అందుతోందని పోలీసు పెద్దలకు తెలిసిపోయింది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న పబ్ పార్ట్నర్ అభిషేక్ విచారణలోనూ దర్యాప్తు అధికారులు ఈ విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఓ అధికారికి నెలకు రూ.లక్ష మరో ఇద్దరికి రూ. 50 వేల చొప్పున ముడుపులు అందుతున్నట్లు అభిషేక్ అంగీకరించినట్లు సమాచారం.
ఆదివారం తెల్లవారుజామున ఫుడింగ్ అండ్ మింక్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తున్న సమయంలోనే ముగ్గురు పోలీసు అధికారుల ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ”నా పబ్పై ఎలా దాడి చేస్తారు. మీకెంత ధైర్యం” అంటూ టాస్క్ఫోర్స్ పోలీసులపై అభిషేక్ చిందులు తొక్కాడని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముగ్గురు పోలీసు అధికారులకు ఫోన్ చేశారు. ”నా పబ్పై దాడి జరుగుతున్న విషయం ముందే ఎందుకు చెప్పలేదు? మీకు ప్రతినెలా కవరు (మామూళ్లు) పంపేది ఎందుకు?” అంటూ విరుచుకుపడ్డట్లు సమాచారం.
ఆ మాట వినగానే టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ ఫోన్ను లాక్కొని ఆ అధికారులు ఎవరో చూసేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోపే లాక్ అయ్యింది. ఆ తర్వాత చాలా సేపు అభిషేక్ అన్లాక్ చేయకుండా సతాయించాడని.. టాస్క్ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో చర్యలకు సిద్ధమవ్వడంతో.. అన్లాక్ చేశాడని సమాచారం. కాల్ లిస్టులో ఆ ముగ్గురు అధికారుల పేర్లను గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు విషయాన్ని సీపీ సీవీ ఆనంద్కు చెప్పారు. ఆయన వెంటనే స్పెషల్ బ్రాంచ్(ఏసీబీ) విచారణకు ఆదేశించారు. ఎస్బీ అధికారులు ఒకట్రెండు రోజుల్లో ఇచ్చే నివేదిక ప్రకారం ‘మామూళ్ల’ అధికారులపై చర్యలుండనున్నాయి.
మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ అల్లుడు కిరణ్రాజ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించి లుక్ఔట్ నోటీసు జారీ చేశారు. అర్జున్ కోసం ఐదు బృందాలతో గాలిస్తున్నారు. అభిషేక్ పబ్లో ఏర్పాటు చేసే పార్టీలకు ఆహ్వానాలు పంపేందుకు కేటగిరీలను బట్టి వేర్వేరు వ్యక్తుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను నిర్వహించాడు. అందులో అభిషేక్ తన పేరును ‘స్టఫ్ మ్యాట్’ అని పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా వరకు కోడింగ్ భాషను వాడాడు. ఆయా సంభాషణలను డీకోడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.