thesakshi.com : మహిళల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. వారి అవసరాలు తీరుస్తామని మాయమాటలతో నమ్మిస్తున్నారు. తరువాత బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి ప్రకాశం జిల్లా పోలీసులను ఆశ్రయించింది.
అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగింది గుంటూరులో కాబట్టి కొత్తపేట పోలీసులకు కేసును బదిలీ చేశారు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన యువతి చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. తెలిసిన వారిని అందర్నీ జాబు కోసం అడుగుతోంది. తనకు జాబ్ చాలా అవసరం అని చెబుతూ వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య వరకు విషయం రావడంతో ఆమెను పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమెను కలిసి.. తనకు అక్కడ తెలిసిన వాళ్లు ఉన్నారని.. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. కొన్ని రోజుల తరువాత ఉద్యోగం దాదాపు ఖరారైందని.. ఈ క్రమంలో 2021 జులై 11న ఆమెను ఉద్యోగ విషయం మాట్లాడుదాం రా అంటూ ఫోన్ చేశాడు.. వెంటనే గుంటూరు రావాలని చెప్పాడు.
ఉద్యోగం కోసం మాట్లాడాల్సిన వ్యక్తి రైలుపేటలోని ఓ లాడ్జిలో ఉన్నారంటూ నమ్మించి.. ఆమెను అక్కడకు తీసుకెళ్లాడు.. అసలైన వ్యక్తి వచ్చే సరికి లేటు అవుతుందని.. కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నాడు. లాడ్జిలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో అత్యాచారం చేశాడని, ఆ తరువాత నగ్న వీడియోలు తీసి తనకే చూపించాడని చెబుతోంది. అక్కడితో వదలకుండా ఈ విషయం ఎవరికైనా చెప్పినా, తాను రమ్మని పిలిచినప్పుడల్లా రాకపోయినా ఆ వీడియోలు అందరికి చూపిస్తానని బెదిరించినట్లు పేర్కొంది.
అక్కడ నుంచి అతడికి అవసరం అనిపించిన ప్రతిసారి ఆ వీడియోలతో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని దర్శి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు కేసును గుంటూరు కొత్తపేటకు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితురాలకు హామి ఇచ్చారు. అయితే ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది అన్నారు. ప్రతి నిత్యం ఇలాంటి వార్తలు వినిపిస్తూ.. ఇటు కామాంధులు మారడం లేదు.. మహిళలు కూడా మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. పరిచయం లేని వ్యక్తులను నమ్మి బయటకు వెళ్లకూడదని పోలీసులు సూచిస్తున్నారు.