thesaksh.com : ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురిలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించింది. దీంతో పెద్దల సభలో బీసీలకు పెద్ద పీట వేసింది. స్థానిక ఎన్నికల నుంచి రాజ్యసభ వరకు బీసీలకు అగ్రతాంబూలం ఇస్తోంది. రాజ్యసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావులను ఎంపిక చేసినట్లు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీసీలకు సముచిత స్థానం ఇస్తున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయ పటిమకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారిని చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన ఆర్.కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావును రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేశారు. గతంలో కూడా ఇద్దరు బీసీలు.. పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు అవకాశం ఇచ్చారని గుర్తుచేవారు. బలహీన వర్గాలకు జగన్ సముచిత స్థానం కల్పించినట్టుగా గతంలో ఎవరూ చేయలేదు. తెలంగాణ, ఆంధ్ర అనే ప్రస్తావన లేదు. బలహీన వర్గాలకు ఏ విధంగా అవకాశం ఇస్తున్నాం అనేదే ముఖ్యం. బీసీలకు సంబంధించి ఆర్.కృష్ణయ్య జాతీయ నాయకుడిగా ఉన్నారు. ఆయనకు ఈ అవకాశం ఇచ్చి, బీసీలకు మా పార్టీ ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తుందనే విషయాన్ని సీఎం చేతల్లో చూపారు. ఇక నిరంజన్‌రెడ్డి సీనియర్ లాయర్. ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది అని తెలిపారు.
బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు. బ్యాక్‌బోన్ క్లాస్ అని నమ్మిన సీఎం జగన్ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల నుంచి రాజ్యసభ ఎన్నికల వరకు అన్నింటిల బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పారు. ఏ ఎన్నికలో అయినా జగన్ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా నలుగురిలో ఇద్దరు బీసీలకు ఇచ్చారు. నిజం చెప్పాలంటే సాక్షాత్తూ ఒక బీసీ సీఎంగా ఉన్నప్పటికీ, ఈ విధంగా నిర్ణయం తీసుకునే వారు కాదేమో. కానీ జగన్ బీసీలకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయంగా తగిన గుర్తింపు, పదవులు ఇస్తున్నారు. జగన్ ఎంపిక చేసిన ఆర్.కృష్ణయ్య తన జీవితమంతా బీసీల కోసం నిలబడ్డారు. వారి సమస్యలపై పోరాడారు. బీసీలందరికీ ఒక గుర్తుగా నిల్చారు. కాబట్టి అలాంటి వారిని అత్యున్నత సభలో కూర్చోబెడితే, బీసీల పక్షాన ఆయన గళం చక్కగా వినిపిస్తారని సీఎంగారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీసీల పార్టీ అని చెప్పుకుంటూ, కేవలం ప్రచారానికే పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ, వారికి ఇస్త్రీ పెట్టెలు, ఏవో పనికిరాని పనిముట్లు ఇచ్చి ఊర్కుంది. అంతేతప్ప బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. మహిళలకు కూడా అవకాశం ఉన్న చోట, భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం కల్పిస్తారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా అవకాశం ఉన్న చోట పదవులు ఇస్తారు. ఈ మూడేళ్లలో చేసిన అన్ని నామినేటెడ్ పోస్టుల్లో.. చివరకు దేవాలయాల బోర్డుల్లో కూడా ఆయా వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించామని తెలిపారు.
తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు రాజ్యసభ అభ్యర్థి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. దాదాపుగా 47 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల గురించి, వారి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి గురించి ఆ కులాలకు పట్టి పీడిస్తున్న అమాయకత్వం గురించి, విముక్తి గురించి అనేక పోరాటాలు చేస్తూ వచ్చానని తెలిపారు. తనను ఏ రాజకీయ పార్టీ గుర్తించలేకపోయింది. ఒకవేళ గుర్తించినా అవకాశం ఇవ్వడానికి భయపడ్డారు. కానీ జగన్… తన సేవ, నిబద్ధత, అంకితభావాన్ని గుర్తించి ఈ వర్గాలకు మరింత సేవ చేసేలా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ పదిమందికి అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 15మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. 25 మంది మంత్రివర్గంలో 15 మందికి స్థానం కల్పించడం చరిత్రలో మొదటిసారిగా చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 45,50 మంది మంత్రులు ఉంటే బీసీలకు పది స్థానాలు కూడా ఇవ్వలేదు. కానీ విభజన తర్వాత, చిన్న రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి జగన్ పదిమందికి మంత్రివర్గంలో చోటు కల్పించడం హర్షించదగ్గ విషయం.
స్వాతంత్ర్యం వచ్చి 74ఏళ్లు అయినా ,భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎవరూ అడగలేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా, చట్టసభలో 50శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, బీసీలకు అన్నిరంగాల్లో రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని పార్లమెంట్‌లో పోరాడిన ఏకైక పార్టీ వైయస్సార్ సీపీ. ఆనాడే దేశ ప్రజలంతా నివ్వెరపోయారు.
తెలంగాణలో పోరాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న బీసీల అభివృద్ధి కోసం తను పని చేస్తున్నానని తెలిపారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే అది ఒక్క తెలంగాణకే కాదు, దేశంలో అందరి కోసం రిజర్వేషన్లు.అలానే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని కొట్టాడుతున్నానని తెలిపారు. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్నది కూడా దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసమే. అదేవిధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈ వర్గాలు అభివృద్ధి చెందాలని జాతీయ స్థాయిలో పోరాడుతున్నానని గుర్తుచేశారు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని.. నిలువెత్తు నిజాలతో, నిలువెత్తు అంకితభావంతో బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్నానని ఆర్ కృష్ణయ్య తెలిపారు.