thesakshi.com : టీడీపీ 40 వసంతాల ప్రస్థానం నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. టీడీపీకి ఎన్టీఆర్ శాపం తగిలి పతనమై పోయిందని, గత ఎన్నికల్లో అది స్పష్టమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీపై పగ తీర్చుకోవడం ఖాయమని అన్నారు.
ఎన్టీఆర్ ను మోసం చేసిన చంద్రబాబును ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కూడా శాపం తప్పకుండా తగులుతుందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ శాపం తగిలే నారా లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయాడని తెలిపారు. చంద్రబాబు వయసు 73 ఏళ్లని, సరిగ్గా నిలుచోలేని, కూర్చోలేని వ్యక్తి టీడీపీని పరుగులు తీయిస్తాడా? అని వ్యంగ్యం ప్రదర్శించారు.
“వెన్నుపోటు పొడిచేదీ మీరే… పార్టీని లాక్కునేదీ మీరే… మళ్లీ ఎన్టీఆర్ ఫొటోలకు దండలు వేసేదీ మీరే” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు, ఎన్టీఆర్ ను పార్టీ నుంచి ఎందుకు పంపారో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. పచ్చ తమ్ముళ్లంతా పండగ చేసుకుంటున్న వేళ…. ఎన్టీఆర్ పేరును సైతం పక్కనపెట్టి, జయము జయము చంద్రన్న అనే భజన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతున్న నేపథ్యం. ఇలాంటి టైమ్ లో టీడీపీకి ఓ అద్భుతమైన బహుమతి ఆఫర్ చేశారు మంత్రి కొడాలి నాని.
ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూనే, పసుపు పార్టీ బాగుపడాలంటే చంద్రబాబు రాజీనామా చేయాలని అన్నారు మంత్రి. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు, పసుపు తమ్ముళ్లకు చంద్రబాబు ఇవ్వగలిగే పెద్ద బహుమతి అదే అన్నారు కొడాలి.
పెద్ద ఎన్టీఆర్ హయాంలో దిగ్విజయంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకొని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇకనైనా ఆ పార్టీని వీడాలని, 40 ఏళ్ల పాటు టీడీపీకి పట్టిన శని వదిలిపోతుందని అన్నారు మంత్రి కొడాలి నాని.
ఎన్టీఆర్ హయాంలో తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పార్టీని చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన పార్టీకి, జాతీయ హోదా కూడా దక్కలేకుండా పోయిందన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు, తన పార్టీలో వ్యక్తుల్ని గ్రామ స్థాయిలో కూడా గెలిపించుకోలేరని.. కేవలం ఎల్లో మీడియా అండదండలతో షో మాత్రం చేస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి. ఎన్టీఆర్ శాపం తగలడం వల్లనే టీడీపీ పతనమైందని, మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారని అన్నారు.
ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే, ఆ ఓట్ల సహాయంతో నందమూరి వంశాన్నే చంద్రబాబు తొక్కిపెట్టారని ఆరోపించారు నాని. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆజమాయిషీ లేని తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రజలు ఎప్పుడూ ఓటు వేయరని అన్నారు.