thesakshi.com : కాలర్ ఎగరేస్తున్న కొడాలి నానికి .. టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టనున్నారా? ఇక్కడ నుంచి వ్యూహాత్మకంగా.. యువ నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు.. టీడీపీ వర్గాలు. దాదాపు 2004 తర్వత నుంచి ఇక్కడ టీడీపీ ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. అప్పట్లో కొడాలికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు తర్వాత.. ఆయన పార్టీకి దూరమయ్యారు. అంతేకాదు.. అవకాశం వచ్చినప్పుడల్లా.. చంద్రబాబుపైనా.. ఆయన కుమారుడిపైనా విరుచుకుపడుతున్నారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలిని ఓడించాలన్నది టీడీపీ గట్టి టార్గెట్. ఆయనకు ఓటమి రుచి చూపిస్తే తప్ప అటు నందమూరి ఇటు నారా ఫ్యాన్స్ అసలు శాంతించేటట్లుగా కనిపించడంలేదు. కొడాలి నాని రెండు సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. నాడు చంద్రబాబు వెంట ఉన్న కొడాలి. అదే టీడీపీకి బాబుకు కొడవలిగా మారిపోయారు.
ఆయన జగన్ పార్టీలో చేరి చంద్రబాబు లోకేష్ నే టార్గెట్ చేసుకున్నారు. ఇక మంత్రి అయ్యాక ఆయన గత మూడేళ్ళుగా బాబుని ఏమీ కాకుండా చేస్తూ చూస్తూ మాటలతో ఈటెలు విసురుతున్నారు. కొడాలి నాని దూకుడు ఒక దశలో పీక్స్ కి చేరిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఆయనకు మంత్రి పదవి కూడా లేకుండా పోయింది.
దీంతో టీడీపీ శిబిరానికి కొంతలో కొంత ఊరట లభించినా అసలైన ఆనందం మాత్రం గుడివాడ బరిలో కొడాలిని ఓడించిన తరువాతనే అని తమ్ముళ్ళు గట్టి శపధం చేస్తున్నారు. మా నాయకుడు చంద్రబాబుని ఆయన ఫ్యామిలీని అనుచితమైన కామెంట్స్ తో ఒక రకమైన ఆటాడుకున్న కొడలి నాని ఈ రోజు మాజీ మంత్రి రేపటి రోజున మాజీ ఎమ్మెల్యే కూడా అని వారు అంటున్నారు.
ఈ నేపధ్యంలో కొడాలి నానిని ఓడించడానికి అనేక రకాలుగా వ్యూహరచన సాగుతోంది. కాపులను అభ్యర్ధులుగా పెట్టాలని మొదట అనుకున్నారు. దాంతో వంగవీటి రంగా కొడుకు రాధాని ఎంచుకున్నారు. అయితే రంగా నాని సాన్నిహిత్యం చూసి ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
అదే విధంగా బీసీలను ముగ్గులోకి దించి కొడాలి నానికి చెక్ చెప్పాలని కూడా ఆలోచించారు. చివరికి అవన్నీ పక్కన పెట్టేసి అనూహ్యంగా ఒక కొత్త ముఖాన్ని తెర మీదకు తెస్తున్నట్లుగా తెలుస్తోంది. పైగా చంద్రబాబు వచ్చాక ఏనాడూ ఒక సామాజికవర్గానికి టికెట్ ఇవ్వలేదు. అదే బ్రాహ్మణ సామాజికవర్గం. ఆ సామాజికవర్గం నుంచి కొడాలిని ఢీ కొట్టే కొత్త క్యాండిడేట్ ని రెడీ చేశారుట.
వివరాల్లోకి వెళ్తే ఆయన పేరు శిష్ట్లా లోహిత్. ఆయన లోకేష్ యువ టీమ్ లో కీ రోల్ ప్లే చేస్తారు. ఇక ఆయనకు రాజకీయలు కొత్త కాదు అంటున్నారు. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారుట. శిష్ట్లా లోహిత్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటున్నారు. అలాగే అనేక వ్యాపారాల్లో కూడా ఆయన ఉన్నారు.
అలా అర్ధబలం గట్టిగా ఉన్న నేత. అన్నింటికీ మించి గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఫ్యామిలీకి మంచి పేరుంది. అన్ని వర్గాలకు తలలో నాలికగా ఉంటుంది ఈ ఫ్యామిలీ. దాంతో లోకేష్ సలహానో మరేమో తెలియదు కానీ ఆయన పేరుని చంద్రబాబు చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నారుట.
ఇప్పటి నుంచే రంగంలోకి దిగిపోమ్మని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. శిష్ట్లా లోహిత్ కి ఫుల్ సపోర్ట్ గా టీడీపీ ఉంటుందని దాంతో ఆయన కొడాలిని ఓడించడమే తరువాయి అని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే అనేక సంచలనాలు నమోదు అవుతాయి.
గుడివాడలో కమ్మ సామాజికవర్గం నుంచే ఎపుడూ గెలుస్తూ వస్తున్నారు. అంతకు ముందు యాదవులు కూడా గెలిచారు. కానీ శిష్ట్లా లోహిత్ ఎమ్మెల్యే అయితే ఫస్ట్ టైమ్ బ్రాహ్మిణ్ ఎమ్మెల్యే అక్కడ నుంచి వస్తారు. పైగా ఆయన యువకుడు కూడా కావడంతో టీడీపీ పక్కా ప్లాన్ తో కధ నడిపిస్తోంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.