thesakshi.com : మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్.
జగన్ కొత్త టీంలో ఎవరెవరు: జిల్లాల వారీగా ..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
పాలనా పరంగా నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు.
అందులో భాగంగా.. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రక్రియ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు.
ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు.
అందు కోసం అధికారులకు కార్యాచరణ నిర్దేశించారు.
ఇక,వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఆ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును సైతం తిరిగి ప్రవేశ పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం.
న్యాయపరంగా చిక్కులు లేకుంటే బిల్లును ఆమోదించి విశాఖ నుంచి పాలన ప్రారంభించాలనే ఆలోచనతో ముందుడగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సీనియర్లు పార్టీ – ప్రభుత్వ సమన్వయం ఇక,ఇదే సమయంలో ఏపీ కేబినెట్ విస్తరణ పైన క్లారిటీ వచ్చింది.
2019 ఎన్నికల తరువాత ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నారేళ్ల తరువాత మారుతుందని సీఎం అప్పట్లోనే స్పష్టం చేసారు.
అయితే,కరోనా కారణంగా దాదాపు ఏడాదికి పైగా పాలన పైన ప్రభావం పడింది.
దీంతో..ఆరు నెలలు పొడిగించి..తన మూడేళ్ల పాలన పూర్తయ్యే వేళ కేబినెట్ విస్తరణ చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఈ ఏడాది మే 30 నాటికి సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తవుతుంది.
జూన్ 8వ తేదీ నాటికి మంత్రివర్గం కొలువు తీరి మూడేళ్లు అవుతుంది.
దీంతో.. మే 30 తరువాత కేబినెట్ విస్తరణ చేపట్టేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ లోగానే పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు..
అదే విధంగా రాజ్యసభలో కొత్తగా నలుగురికి స్థానం కల్పించాల్సి ఉంది.
కొత్త జిల్లాలు.. కొత్త సమీకరణాలు
వీటిని పూర్తి చేసుకొని..కొత్త జిల్లాల్లో పాలనతో పాటుగా కొత్త మంత్రివర్గంతో మిగిలిన రెండేళ్ల పాలనకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు.
ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగినా… మే నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అయితే,ఇప్పటికే ఉన్న మంత్రుల్లో అందరినీ తొలిగించి..కొత్త వారితోనే భర్తీ చేస్తారని చెబుతున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
దీంతో..కొందరు సీనియర్లను కొనసాగిస్తారనే అభిప్రాయం ఉన్నా.. మొత్తంగా కొత్త వారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రాంతీయ -సామాజిక సమీకరణాల ఆధారంగా జగన్ ఎలక్షన్ కేబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో పోటీ సైతం ఎక్కువగా ఉంది.
పెరిగిపోతున్న ఆశావాహుల జాబితా
ఇక,జిల్లాల వారీగా ప్రముఖంగా మంత్రి పదవుల కోసం రేసులో ఉన్న వారిలో శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారాం,అదే విధంగా ధర్మాన ప్రసాద రావు తొలి వరుసలో ఉన్నారు.
విజయనగరం నుంచి రాజన్నదొర..కోలగట్ల వీర భద్రస్వామి పేర్లు వినిపిస్తున్నాయి.
విశాఖ నుంచి ముత్యాల నాయుడు..గుడివాడ అమర్నాధ్ రేసులో ముందున్నారు.
ప్రాంతీయ-సామాజిక లెక్కలు తప్పకుండా తూర్పు గోదావరి నుంచి ముగ్గురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
అందులో కాపు కోటా నుంచి దాడిశెట్టి రాజా, బీసీ వర్గం నుంచి పొన్నాడ సతీష్, అదే విధంగా కొండేటి చిట్టిబాబు పేర్లు వినిపిస్తున్నాయి.
పశ్చిమ గోదావరి నుంచి క్షత్రియ కోటాలో ప్రసాద రాజు, ఆయనతో పాటుగా గ్రంధి శ్రీనివాస్,బాలరాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
క్రిష్ణా జిల్లా నుంచి పార్ధసారధి పేరు ఖాయమని చెబుతున్నారు.
సామాజిక సమీకరణాలే కీలకంగా అదే విధంగా..జోగి రమేష్, సామినేని ఉదయభాను పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు,మర్రి రాజశేఖర్,బీసీ వర్గం నుంచి జంగా క్రిష్ణమూర్తి, ఆళ్ల రామక్రిష్ణారెడ్డి,పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి.
ప్రకాశం జిల్లా నుంచి మహీధర్ రెడ్డి,అన్నా రాంబాబు, సుధాకర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి,ఆనం రామానారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
చిత్తూరు జిల్లా నుంచి, కోనేటి ఆదిమూలం ద్వారకా నాధ్ రెడ్డి, రోజా,చెవిరెడ్డి భాస్కర రెడ్డి,భూమన కరుణాకర రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా, వీరిలో ఒకరితో పాటుగా బీసీ వర్గానికి ఒక బెర్తు ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
2024 టార్గెట్ గా డ్రీం కేబినెట్ కూర్పు.
కడప జిల్లా నుంచి కోరుముట్ల శ్రీనివాసులు, సీ రామచంద్రయ్య, శ్రీకాంత రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
అదే విధంగా కర్నూలు జిల్లా నుంచి శిల్ప చక్రపాణి రెడ్డి, హఫీజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
చివరగా అనంతపుం నుంచి పోటీ ఎక్కువగా ఉంది.
వారిలో అనంత వెంకటరామి రెడ్డి, ప్రకాశ్ రెడ్డి,ఉషా శ్రీ చరణ్, కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అయితే,ఇక్కడ బీసీ – రెడ్డి వర్గాలకు అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.
దీంతో..జగన్ చివరకు ఏ జిల్లా నుంచి ఏ వర్గానికి ..ఎవరికి అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిందే.